స్మోకింగ్ సన్నివేశాలపై హీరో సంచలన కామెంట్!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ `అమరన్` తో గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jan 2025 8:30 AM GMTకోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ `అమరన్` తో గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఆ సినిమా పాన్ ఇండియాలో భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో శివ కార్తికేయన్ తెలుగు మార్కెట్ రెట్టింపు అయింది. కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఇప్పుడా ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాల్సిన బాధ్యత అంతే ఉంది.
దీనిలో భాగంగా స్టోరీల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్యూలో ధూమపానం సన్నివేశాల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. `ఆఫ్ ది స్క్రీన్-ఆన్ ది స్రీన్ స్మోకింగ్ చేయను. కానీ దర్శకుడు స్మోకింగ్ సీన్ రాస్తే మాత్రం తప్పకుండా స్మోకింగ్ చేస్తా. కానీ అందుకు ఓ కండీషన్ ఉంది. నేను తాగే సిగరెట్టు ఆ సన్నివేశానికి న్యాయం చేసేలా ఉండాలి. స్మోకింగ్ అన్నది అక్కడ సీన్ బలంగా డిమాండ్ చేయాలి.
అప్పుడే ఆ ఛాన్స్ తీసుకుంటాను. నా సినిమా చూడటానికి అన్ని వర్గాల ప్రేక్షకులు వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ , పిల్లలు అంతా నా సినిమా థియేటర్లో ఉంటారు. నేను నటించే ఏ సీన్ అయినా వాళ్లకు అసౌకర్యం కలిగించకూడదు. అవసరం లేకున్నా స్మోకింగ్ సన్నివేశాలు అతికించినట్లు ఉంటే? మాత్రం ఆ సన్నివేశాల్లో స్మోకింగ్ చేయనని నిర్మొహ మాటంగా చెప్పేస్తాను. ఆవిషయంలో దర్శకులను నొప్పించకుండా నో చెబుతాను.
అలాగని వాళ్ల క్రియేటివిటీకి అడ్డు తగలను. వాళ్లకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తాను` అని అన్నారు. స్మోకింగ్ సన్నివేశాలకు చాలా మంది స్టార్ హీరోలు దూరంగానే ఉంటారు. కెరీర్ ఆరంభంలో నటుడిగా ఎదిగే సమయంలో సూపర్ స్టార్ మహేష్ కూడా స్మోకింగ్ సన్నివేశాల్లో నటించేవారు. కాలక్రమంలో అలాంటి సన్నివేశాలకు స్వస్తి పలికారు. చాలా కాలం తర్వాత మళ్లీ `గుంటూరు కారం`లో బీడీ తాగే సన్నివేశంలో నటించారు. అది ఒరిజిన్ బీడీ కాదు. అదో ఆయుర్వేదిక్ బిడీ. ఆ బీడికి తాగడానికి కూడా మహేష్ ని త్రివిక్రమ్ చాలా సేపు ఒప్పించాల్సి వచ్చింది.