Begin typing your search above and press return to search.

ఆ టైటిల్ గొడవ సమసింది కానీ...

ఇద్దరు తమిళ హీరోలు.. తెలుగులో తమ సినిమా టైటిల్ గురించి గొడవ పడే పరిస్థితి రావడం రెండు రోజుల ముందు చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   31 Jan 2025 6:53 AM GMT
ఆ టైటిల్ గొడవ సమసింది కానీ...
X

ఇద్దరు తమిళ హీరోలు.. తెలుగులో తమ సినిమా టైటిల్ గురించి గొడవ పడే పరిస్థితి రావడం రెండు రోజుల ముందు చర్చనీయాంశంగా మారింది. తన చివరి చిత్రం ‘అమరన్’ మెగా హిట్ అయ్యాక శివకార్తికేయన్... తెలుగమ్మాయి అయిన ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతో ‘పరాశక్తి’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి అటు తమిళంలో, ఇటు తెలుగులో ఒకే టైటిల్ పెట్టారు. కానీ ఇదే టైటిల్‌ను ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ రిజిస్టర్ చేయించుకున్నాడు.

తన కొత్త చిత్రం ‘శక్తి తిరుమగన్’ను తెలుగులో ‘పరాశక్తి’తో రిలీజ్ చేయనున్నట్లు అతను ప్రకటించడంతో వివాదం తలెత్తింది. తాను గత ఏడాదే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు అతను ఆధారాలు కూడా చూపించాడు. ఐతే శివకార్తికేయన్ సినిమా టైటిల్‌ను ఒక ఆకర్షణీయ టీజర్ ద్వారా అనౌన్స్ చేశాక.. పేరు మార్చడం అంటే ఇబ్బందే. దీంతో రెండు రోజుల పాటు తర్జనభర్జనలు జరిగాయి.

కాగా ఇప్పుడు ఈ వివాదం సెటిలైంది. విజయ్ ఆంటోనీనే తెలుగు టైటిల్ విషయంలో కొంచెం తగ్గాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను ఓ షరతు పెట్టాడు. తెలుగు వరకు మాత్రమే తన సినిమా టైటిల్ మార్చుకుంటానని అతను స్పష్టం చేశాడు. మలయాళం, కన్నడ, మలయాళంలో మాత్రం అతను ‘పరాశక్తి’ టైటిల్‌తోనే సినిమాను రిలీజ్ చేస్తాడట. శివకార్తికేయన్ సినిమాను తమిళం, తెలుగులో ‘పరాశక్తి’ పేరుతో విడుదల చేయాల్సి ఉంటుంది.

కానీ ఇది శివ సినిమాకు ఇబ్బందే. ఎందుకంటే ‘అమరన్’ సినిమాతో అతడి ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. దర్శకురాలు సుధ కొంగరకు కూడా దేశమంతా గుర్తింపు ఉంది. వీరి కలయికలో వచ్చే సినిమాను కేవలం తమిళ, తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయరు. మలయాళం, హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అలాంటపుడు ముందుగా, వేసవికే రిలీజ్ కాబోతున్న విజయ్ ఆంటోనీ సినిమా ‘పరాశక్తి’ పేరుతో వస్తే ఇబ్బందే. కాబట్టి మళ్లీ చర్చలు జరిపి అన్ని చోట్లా విజయ్ సినిమా టైటిల్ మార్చుకునేలా చూసే అవకాశాలే ఎక్కువ.