వాళ్లు అన్నది జరిగితే ఆత్మహత్య చేసుకునేవాడిని..!
దాంతో ఏం చేయాలో పాలుపోలేదని, చివరి నిమిషంలో చేసేది ఏమీ లేక అలాగే విడుదల చేశామని ఎస్ జే సూర్య తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
By: Tupaki Desk | 23 March 2025 11:57 AM ISTఇటీవల కాలంలో నటుడిగా ఎస్ జే సూర్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకప్పుడు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో సరదాగా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ వచ్చిన సూర్య ఇటీవల స్టార్ హీరోల సినిమాల్లో, భారీ బడ్జెట్ సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తూ వస్తున్నాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తున్న ఎస్ జే సూర్య త్వరలో 'వీర ధీర సూర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎస్ జే సూర్య పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ గత వారం రోజులుగా బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఖుషి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
1999లో వాలి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఎస్ జే సూర్య 2000 సంవత్సరంలో తమిళ్‌లో విజయ్ హీరోగా జ్యోతిక హీరోయిన్‌గా 'ఖుషి' సినిమాను రూపొందించాడు. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో విజయ్ వంటి స్టార్‌తో ఖుషి సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఖుషి సినిమా అంతా పూర్తయింది. విడుదలకు కొన్ని రోజుల సమయం ఉండగా కొందరు సినిమాను చూసి అస్సలు బాగాలేదని రివ్యూ ఇచ్చారట. తమిళ్‌లో ఖుషి సినిమా కాపీ చూసిన వారిలో ఏ ఒక్కరికీ నచ్చలేదట. దాంతో ఏం చేయాలో పాలుపోలేదని, చివరి నిమిషంలో చేసేది ఏమీ లేక అలాగే విడుదల చేశామని ఎస్ జే సూర్య తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
కాపీ చూసిన వారిలో ఏ ఒక్కరికి నచ్చని ఖుషి సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కి ఖుషి సినిమా ఆ సమయంలో బాగా నచ్చింది. అత్యధిక వసూళ్లను సైతం రాబట్టిందని అన్నాడు. ఒకవేళ ఖుషి కాపీ చూసిన వారు అన్నట్లుగానే థియేటర్ రిలీజ్‌లోనూ అదే ఫలితం పునరావృతం అయితే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునేవాడిని. ఆ బాధలో తనకు చావు తప్ప మరో దారి కనిపించేది కాదని సూర్య అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. తమిళ్‌లో ఖుషి సూపర్ హిట్ కావడంతో బ్యాడ్ రివ్యూలు ఇచ్చిన వారు కూడా షాక్ అయ్యారని, కొన్ని సినిమాలు అలా అంచనాలను తారు మారు చేసి విజయాన్ని సొంతం చేసుకుంటాయని ఎస్ జే సూర్య చెప్పుకొచ్చాడు.
తమిళ్‌లో సూపర్ హిట్ కావడంతో పాటు విజయ్‌కి యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ దక్కడంతో తెలుగులో పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. యూత్ ఆడియన్స్‌లో పవన్ కళ్యాణ్‌కి విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన సినిమాల్లో ఖుషి ఒకటి అనడంలో సందేహం లేదు. తమిళ్ వర్షన్‌లో చిన్న చిన్న మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేశారు. ఎస్ జే సూర్య ఖుషితో సూపర్ హిట్ సొంతం చేసుకున్న తర్వాత వెంటనే మహేష్ బాబుతో 'నాని' సినిమాను రూపొందించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత పవన్ తో రూపొందించిన పులి సినిమా కూడా డిజాస్టర్‌గా మిగిలింది. అందుకే దర్శకత్వం పై సూర్య ఆసక్తి చూపించకుండా నటనకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ప్రస్తుతం సూర్య చాలా బిజీగా ఉన్నాడు. తెలుగులో చివరగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దర్శకుడిగా మరోసారి సినిమా చేసే ఆలోచన ఉన్నట్లు కూడా సూర్య చెప్పుకొచ్చాడు. అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు.