Begin typing your search above and press return to search.

చియాన్ సినిమాపై హైపెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్' విలన్!

ఆయన తాజాగా ఎక్స్ వేదికగా షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 6:11 PM GMT
చియాన్ సినిమాపై హైపెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ విలన్!
X

కోలీవుడ్ వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వీర ధీర శూరన్''. ఇది ఆయన కెరీర్ లో 62వ చిత్రం. ఇటీవలే ఈ మూవీ టైటిల్ టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ‘చిన్నా’ ఫేం ఎస్‌.యు అరుణ్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దర్శక నటుడు ఎస్‌.జె.సూర్య‌, మలయాళ నటుడు సూరజ్ వెంజరామూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన తాజాగా ఎక్స్ వేదికగా షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ పంచుకున్నారు. సినిమా పట్ల దర్శకుడికి నిబద్ధతను ప్రతిభను కొనియాడారు.

''మధురైలో నిన్న రాత్రి 'వీర ధీర సూర' సినిమా షూటింగ్ జరిగింది. నేను, చియాన్ విక్రమ్ సర్, సూరజ్ వెంజరామూడు సార్ మధ్య ఎక్సట్రార్డినరీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని దర్శకుడు అరుణ్‌ కుమార్ చిత్రీకరించారు. షూట్ చేయడానికి ముందు, అతను ఈ ఎపిసోడ్‌ని తన అసిస్టెంట్స్ టీమ్‌తో కలిసి దాదాపు 10 రోజుల పాటు రిహార్సల్ చేసి, ఆపై మమ్మల్ని లొకేషన్‌కు తీసుకువచ్చి మాతో 3 రాత్రులు రిహార్సల్ చేయించాడు. గత రాత్రి తెల్లవారుజామున 5.05 గంటలకు మేము దాన్ని పూర్తి చేసాం. అరుణ్ కుమార్ గొప్ప దర్శకుడు. నిర్మాత శిబు థమీన్స్ కు అభినందనలు'' అని ఎస్‌.జె.సూర్య‌ పోస్ట్ చేసారు. దీనికి శిబు స్పందిస్తూ ''మీ నుండి ఈ మాటలు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఇష్టమైన నటులు విక్రమ్, సూర్య, సురాజ్, అరుణ్ అన్నతో కలిసి ఇలాంటి రిజల్ట్ చూస్తున్నందుకు మరింత ఉత్సాహంగా ఉంది'' అని పేర్కొన్నారు.

డైరెక్టర్ అరుణ్ కుమార్ గతంలో 'పన్నయ్యరుమ్ పద్మినియుమ్', 'సేతుపతి', 'సింధుబాద్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గతేడాది 'చిన్నా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బొమ్మరిల్లు సిద్దార్థ్ తో చేసిన ఈ సినిమాలో చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్యను చూపించారు. ఈ క్రమంలో విక్రమ్ తో ''వీర ధీర శూరన్ 2'' మూవీ చేసే అవకాశాన్ని అందుకున్నారు. దీంట్లో విక్రమ్, ఎస్‌జె సూర్యలు మునుపెన్నడూ చూడని పాత్రల్లో కనిపిస్తారని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆకట్టుకుంది.

'వీర ధీర శూరన్ 2' చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై శిబు థమీన్ కుమార్తె రియా శిబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ నిర్వహిస్తున్నారు. 'తంగలాన్' తర్వాత విక్రమ్ నుంచి రాబోయే సినిమా ఇదే. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎస్‌జె సూర్య ప్రీ క్లయిమాక్స్ గురించి చెప్పి హైప్ ఎక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలలు వెల్లడి కానున్నాయి.

ఇక ఎస్‌జె సూర్య విషయానికొస్తే, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇటీవలే 'ఇండియన్ 2' 'రాయన్' సినిమాలతో అలరించిన సూర్య.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీలో విలన్ గా నటిస్తున్నారు. అలానే తెలుగులో నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' చిత్రంలోనూ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. 'సర్దార్ 2' 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' 'ఇండియన్ 3' తో పాటుగా మరికొన్ని తెలుగు తమిళ మలయాళ చిత్రాలు ఎస్‌జె సూర్య చేతిలో ఉన్నాయి.