Begin typing your search above and press return to search.

డిజాస్టర్ మూవీకి 100+ మిలియన్ వ్యూస్!

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే టాలీవుడ్ లో డిజాస్టర్ గా మారిన ఓ మూవీ ఇప్పుడు హిందీలో ఊహించని విధంగా మిలియన్ వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   25 July 2024 8:19 AM GMT
డిజాస్టర్ మూవీకి 100+ మిలియన్ వ్యూస్!
X

తెలుగు సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన మాస్ చిత్రాలకు అక్కడ మంచి ఆదరణ దక్కుతుంది. ఇక్కడి ప్లాప్ చిత్రాలను, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే.. మిలియన్ల కొలదీ వ్యూస్ సాధిస్తుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే టాలీవుడ్ లో డిజాస్టర్ గా మారిన ఓ మూవీ ఇప్పుడు హిందీలో ఊహించని విధంగా మిలియన్ వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. ఆ సినిమా మరేదో కాదు ''స్కంద: ది ఎటాకర్''.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'స్కంద: ది ఎటాకర్'. 2023 సెప్టెంబర్ నెలాఖరున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దాదాపు 90 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తే, బాక్సాఫీస్ వద్ద 60 కోట్లు కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవడంతో ట్రేడ్ వర్గాలు డిజాస్టర్ అని తేల్చేశాయి. నార్త్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. ఓటీటీలో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఈ సినిమా.. టీవీల్లో మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్స్ అందుకుంది. ఈ క్రమంలో హిందీ వెర్షన్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

'స్కంద' మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఇటీవలే యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. దీనికి ఆడియన్స్ నుంచి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. నెల రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు 1.1 మిలియన్ కు పైగా లైక్స్ రాబట్టింది. థియేటర్లలో ప్లాప్ అయిన సినిమాకి ఇంత తక్కువ కాలంలో ఈ రేంజ్ లో వ్యూస్, లైక్స్ రావడం మామూలు విషయం కాదు. ఇది రామ్ - బోయపాటిల మాసివ్ కాంబోకి హిందీలో ఎంత క్రేజ్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది.

నిజానికి హీరో రామ్ పోతినేని - డైరెక్టర్ బోయపాటి శ్రీనుల హిందీ డబ్బింగ్ చిత్రాలకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తుంటాయి. 'జయ జానకీ నాయక' 'సరైనోడు' 'వినయ విధేయ రామ' 'అఖండ' వంటి సినిమాలకు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. మరోవైపు రాపో ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. యూట్యూబ్ లో రెండు బిలియన్లకు పైగా వ్యూస్ అందుకున్న మొదటి హీరోగా, ఏకైక సౌత్ హీరోగా రామ్ పేరిట ఓ రికార్డ్ కూడా ఉంది. ఇప్పుడు 'స్కంద' హిందీ వెర్షన్ తో మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ హిందీ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.

'స్కంద' మూవీలో రామ్ డ్యూయెల్ రోల్ లో ఊరమాస్ లుక్ లో కనిపించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జీ స్టూడియోస్ & పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.