Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : స్కంద

By:  Tupaki Desk   |   28 Sep 2023 7:12 AM GMT
మూవీ రివ్యూ : స్కంద
X

'స్కంద' మూవీ రివ్యూ

నటీనటులు: రామ్ పోతినేని-శ్రీలీల-సయీ మంజ్రేకర్-శ్రీకాంత్-దగ్గుబాటి రాజా-ప్రిన్స్-శరత్ లోహితశ్వ-అజయ్ పుర్కార్-గౌతమి-ఇంద్రజ-పృథ్వీ తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: సంతోష్ దేటకే

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను

'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రం.. స్కంద. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుర్కార్) కూతురి పెళ్లి జరుగుతుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితశ్వ) కొడుకు వచ్చి పెళ్లికూతురిని తీసుకెళ్లిపోతాడు. దీంతో తెలంగాణ సీఎం.. ఆయన కొడుకుని మట్టుబెట్టాలని ఏపీ సీఎం రగిలిపోతుంటాడు. సుపారీ కిల్లర్లు ఒక్కొక్కరిగా తెలంగాణ సీఎం మీద ఎటాక్ చేయడానికి సిద్ధమవుతారు. కానీ వాళ్లకు రుద్రకంటి భాస్కర్ (రామ్) అడ్డు పడి.. అందరినీ లేపేస్తాడు. చివరికి అతను ఏపీ సీఎం మనిషే అని తెలుస్తుంది. భాస్కర్ తెలంగాణ సీఎం ఇంట్లో అడుగుపెట్టి ఏపీ సీఎం కూతురినే కాక.. తెలంగాణ సీఎం కూతురిని కూడా తీసుకెళ్లిపోతాడు. అప్పుడే తన ఉద్దేశం వేరు అని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ అతను టార్గెట్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ భాస్కర్ కథేంటి.. అతనెందుకిలా చేశాడు.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

బోయపాటి శ్రీను అంటేనే కంప్లీట్ మాస్ సినిమానే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కథలో.. పాత్రల్లో.. సన్నివేశాల్లో లాజిక్కులు పట్టించుకోకుండా సినిమా చూసేయాలి. అదే పంథాలో స్కంద కూడా కొనసాగింది.'స్కంద' సినిమా నుంచి వచ్చి తొలి ట్రైలర్లో.. రామ్ కత్తి తీసుకుని విలన్లను పోట్లు పొడిచిన తీరు చూస్తేనే ఇది బోయపాటి మార్క్ సినిమా అని అర్ధమైంది. రెండో ట్రైలర్లో ట్రాక్టర్ని బైకు తిప్పినట్లుగా 360 డిగ్రీల్లో తిప్పిన సీన్ చూస్తే మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ పక్కా అన్న క్లారిటీ వచ్చేసింది. లాజిక్కులతో సంబంధం లేకుండా.. ఓవర్ ద టాప్ ఎలివేషన్లు.. ఊర మాస్ యాక్షన్ సీన్లకు ప్రిపేరై వెళ్లే వాళ్లకు 'స్కంద' ఓకే అనిపిస్తుంది. అలా కాకుండా కథలో కొత్తదనం కోసం చూసినా.. సన్నివేశాల్లో లాజిక్కుల మీద దృష్టిపెట్టినా.. 'స్కంద'తో ఎక్కువ సమయం ట్రావెల్ చేయలేరు. ఇది సగటు బోయపాటి మార్కు మాస్ మూవీ. రామ్ ఎనర్జీని వాడుకుని అతను మాస్ ను ఎంటర్టైన్ చేయడానికి చేసిన ప్రయత్నం కాబట్టి ఆ విషయంలో బోయపాటి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

బోయపాటి మార్కు.. నందమూరి బాలకృష్ణకు సూట్ అయినట్లు వేరే వాళ్లకు సూట్ కాదు అని చాలా సినిమాల్లో రుజువైంది. 'అఖండ' కంటే ముందు 'వినయ విధేయ రామ'లో రామ్ చరణ్ తో బోయపాటి చేయించిన అతి.. పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా తయారైంది. 'స్కంద'లో అలా మరీ నేల విడిచి సాము చేయకుండా.. మాస్ ను మెప్పించడానికి ప్రయత్నించాడు బోయపాటి. సినిమాలో హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలే. ఐతే యాక్షన్.. లవ్.. సెంటిమెంట్.. ఇలా సీన్ ఏదైనా సరే 'అతి' మాత్రం కామన్ అన్నట్లుగా సాగిపోతుందీ సినిమా. రెండూ ముప్పావు గంటల నిడివి ఉన్న సినిమాలో హీరో దాదాపు రెండు గంటలు కనిపిస్తే.. ఒక గంటసేపు ఫైట్లు మాత్రమే చేస్తుంటాడు. ఇక పంచ్ డైలాగుల సంగతి సరే సరి. బాలయ్య అంటే ఎన్ని తలలు తెంచినా చెల్లిపోతుంది కానీ.. రామ్ లాంటి యంగ్ హీరో రకరకాల ఆయుధాలు పట్టుకుని వందల మందిని ఎలా పడితే అలా చంపి అవతల పడేస్తుంటే మాత్రం కొద్దిగా అతి అనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం సర్దుకోవాలి.

ఇక సినిమా అసలు కథ రివెంజ్ పాయింట్ లోకి వస్తే హీరో తన తండ్రి స్నేహితుడికి అన్యాయం జరిగిందని ఇద్దరు సీఎంల మీదకు వెళ్లడం అనేది మూల కథ. అంతేకాదు ఇద్దరు సీఎంలు ప్రతిసారి కలిసి డీల్స్ చేయడం అన్నది అర్ధం కాదు. వేల కోట్ల అధిపతి అయిన ఓ వ్యక్తి పెల్లెటూరిలో స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వచ్చి అతని కొడుకుని పొగుడుతూ ఎలివేషన్లు ఇస్తుంటాడు. ఇవి సినిమాలో కథకు అవసరం లేకపోయినా హీరో ఎలివేషన్ కి వాడుకున్నట్టుగా ఉంటుంది. రామ్ ఇంట్రో సీన్ బాగా పేలింది. ప్రథమార్ధంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో బోయపాటి కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కవుట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదనిపిస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే యాక్షన్ సీన్లలో భారీతనం.. ఎలివేషన్ మాస్ ను మెప్పిస్తుంది. కథ గురించి పెద్దగా పట్టించుకోకుండా.. లాజిక్కుల గురించి ఆలోచించకుండా ఓవర్ ద టాప్ ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలను ఎంజాయ్ చేయాలంటే 'స్కంద' చూడొచ్చు.

నటీనటులు:

రామ్ చూడ్డానికి సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ.. మాస్ క్యారెక్టర్లలోనూ మెప్పించగలడు. 'ఇస్మార్ట్ శంకర్' అందుకు ఉదాహరణ. 'స్కంద'లో బోయపాటి మార్కు మాస్ క్యారెక్టర్లో అతను ఒదిగిపోవడానికి బాగానే కష్టపడ్డాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఈ క్యారెక్టర్ కు సెట్ అయ్యాయి. రామ్ ను ఇంత మాస్ పాత్రలో చూసి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది కానీ.. ఆ తర్వాత ఓకే అనిపిస్తుంది. రామ్ తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడు ఈ రేంజ్ మాస్ మూవీ చేయలేదు. రామ్ ఎనర్జీతో బోయపాటి మార్క్ ఉస్తాద్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. ఫైట్లు.. డ్యాన్సుల్లో రామ్ అదరగొట్టాడు. హీరోయిన్ శ్రీలీల ఒక ఉత్సవ విగ్రహంలా తయారైంది. మరో కథానాయిక సయీ మంజ్రేకర్ పాత్ర తనతో పోలిస్తే కొంచెం నయం. కానీ ఆమె అప్పీయరెన్స్ సాధారణంగా అనిపిస్తుంది. దగ్గుబాటి రాజా.. శ్రీకాంత్ బాగానే చేశారు. విలన్లు అజయ్ పుర్కార్.. శరత్ లోహితశ్వ చాలా మామూలుగా అనిపిస్తారు. గౌతమి అసలు సినిమాలో ఎందుకుందో అర్థం కాదు. ఆమెని సరిగా వాడుకోలేకపోయాడు బోయపాటి.

సాంకేతిక వర్గం:

'అఖండ'కు తన సంగీతంతో పెద్ద ఎసెట్ గా నిలిచిన తమన్.. 'స్కంద'లో మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. అతడి పాటలు సోసోగా అనిపిస్తాయి. రామ్.. శ్రీలీల తమ డ్యాన్సులతో రెండు పాటలను నిలబెట్టారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అఖండ రేంజ్ లో లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. సంతోష్ దేటకే కెమెరా పనితనం ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక పెద్ద సినిమా స్థాయిలో రిచ్ గా తీశారు సినిమా. బోయపాటి శ్రీను యాక్షన్ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ, స్క్రీన్ ప్లే మీద పెడితే స్కంద ఇంకాస్త బాగా వచ్చేదని చెప్పొచ్చు.

చివరగా: స్కంద.. ఓన్లీ మాస్

రేటింగ్ - 2.5/5