Begin typing your search above and press return to search.

నాగవంశీ కామెంట్స్ పై స్పందించిన 'బేబీ' నిర్మాత!

ఒక ఫ్యామిలీని మూడు గంటలు థియేటర్ లో కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి రూ.1500 తీసుకుంటే తప్పేంటని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Oct 2024 11:35 AM GMT
నాగవంశీ కామెంట్స్ పై స్పందించిన బేబీ నిర్మాత!
X

ఈరోజుకీ చీప్ గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే.. ఒక ఫ్యామిలీని మూడు గంటలు థియేటర్ లో కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి రూ.1500 తీసుకుంటే తప్పేంటని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదనపు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై 'బేబీ' నిర్మాత ఎస్‌కేఎన్‌ రియాక్ట్ అయ్యారు.

‘ఘటికాచలం’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ కామెంట్స్ మీద SKN స్పందించారు. ఒక ప్రొడ్యూసర్‌ మాటలపై ఇంకో ప్రొడ్యూసర్‌ విశ్లేషణ చేయొచ్చు అంటారా? అంటూనే టికెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వంశీ చెప్పినట్లు నిజంగా అంత చీప్ గా దొరికే వినోదమో కాదో తెలియదు కానీ, ప్రస్తుతం చీప్ గా దొరికే వాటిల్లో ఒకటని అన్నారు. ముంబై, బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే మన దగ్గర రేట్లు తక్కువే అని చెప్పారు. టికెట్‌ ధరల పెంపు అనేది ప్రతి సినిమాకు ఉండదని, కేవలం కొన్నింటికి మాత్రమే ఉంటుందని ఎస్‌కేఎన్‌ పేర్కొన్నారు.

"నేను దీని మీద ఏం చెప్పినా సోషల్‌ మీడియాలో నన్ను రెండు రకాలుగా తిడతారు. చీప్ అని అంటే 1500 చీప్ నా? అని తిడతారు. కాదు అంటే 'దేవర' కు టికెట్లు పెట్టినందుకు ఇలా అంటావా? అని అటు తిడతారు. బండి దగ్గర ఇడ్లీ రూ.20కి దొరుకుతుంది.. అదే చట్నీస్ లో రూ.200 కి దొరుకుతుంది. ఎక్కడ తినాలనేది మన వ్యక్తిగతం. మనం కోరుకునే కంపర్ట్ ను బట్టి, మనం డబ్బులు చెల్లిస్తుంటాం. అలానే మల్టీప్లెక్స్‌లో రూ.300 పెట్టి సినిమా చూడాలా? అనుకున్నప్పుడు సింగిల్‌ స్క్రీన్‌లో చూడొచ్చు. నేను చాలా సినిమాలు సింగిల్‌ స్క్రీన్‌లోనే చూస్తాను" అని ఎస్‌కేఎన్‌ అన్నారు.

"టికెట్‌ రేట్లపై ఒక అపోహ ఉంది. పెంచిన టికెట్‌ రేట్ల డబ్బులు ప్రొడ్యూసర్ కే వస్తాయని అనుకుంటారు. వంశీ చెప్పినట్లు రూ.1500 ఖర్చు పెడితే, అందంతా నిర్మాతకు రాదు. అందులో 28 శాతం గవర్నమెంట్ కు ట్యాక్స్ పోతుంది. 50-60 శాతం ఎగ్జిబిటర్లు, థియేటర్స్‌ నడిపేవాళ్లకు పోతుంది. మిగిలిన దాంట్లో 30-35 శాతం మాత్రమే నిర్మాత జేబులోకి వస్తుంది. బడ్జెట్‌ను బట్టి, ప్రపంచంలో ప్రతి వస్తువుకు ధర నిర్ణయించుకునే సౌలభ్యం దాన్ని తయారు చేసిన వాడికి ఉంటుంది. అంత ధర పెట్టి కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడి ఇష్టం. బహుశా వంశీని ఒకటికి పదిసార్లు ఈ విషయం గురించి అడగడం వల్ల కొద్దిగా గట్టిగా సమాధానం చెప్పి ఉండవచ్చు" అని నాగ వంశీకి మద్దతు నిలిచారు.

"సినిమాకు ఆడియెన్ కు మధ్య ఉండేది కన్స్యూమర్ రిలేషన్ షిప్ కాదు. సినిమా అనేది మనకు ఒక వ్యాపకం.. ఒక జ్ఞాపకం. సినిమా మన జీవితంలో ఒక ట్రెడిషన్. చాలా విషయాలు దాన్నుంచే ఫాలో అవుతాం. మనకు కొత్తగా ఓ అమ్మాయి పరిచయమైతే సినిమాకు తీసుకెళ్ళాలని అనుకుంటాం. మనసు బాగలేకపోతే సినిమాకు వెళ్ళాలని అనుకుంటాం. మనసు బాగుండి మజా చేయాలంటే కూడా సినిమాకే వెళ్ళాలని అనుకుంటాం. ఇలా సినిమా అనేది అంతర్లీనంగా మనలో భాగం అయిపోయింది"

"మనలో భాగమైపోయిన సినిమాను 'తక్కువ ధరకే ఇవ్వు'మని అడిగే హక్కు ఆడియన్ కు ఉంటుంది. 'పెట్రోల్‌, బంగారం రేటు పెరిగినట్లే టికెట్‌ ధరలూ పెరిగాయి. అందుకే తక్కువకు ఇవ్వలేకపోతున్నాం' అని నిర్మాతలు చెప్పొచ్చు. అంతే తప్ప, ఇదేదో ఒకరి జేబుల్లో నుంచి తీసుకుందామని కాదు. రియల్‌ ఎస్టేట్‌ పెరిగి రెంట్లు పెరిగాయి. పంజాగుట్ట, అమీర్‌ పేట లాంటి బిజీ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ కట్టి అన్నీ ఇస్తున్నాడంటే రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఇలా అన్నీ ఆలోచించాలే కానీ, రేట్లు పెంచేశారు అనేయకూడదు."

"వంశీగారు చెప్పినట్లు సినిమా అనేది నిజంగా అంత చీప్ గా దొరికే వినోదమో కాదో నాకు తెలియదు. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో ఒకటి. బెంగళూరులో ఉన్నట్లు ఇక్కడ ఫ్లెక్సీ ప్రైసింగ్‌ లేదు. వీకెండ్‌లో అక్కడ టికెట్‌ రేటు రూ.750 ఉంటుంది. మనం ఇక్కడ ఎప్పుడైనా అంత రేటు పెట్టామా?. ముంబై, బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలతో కంపేర్ చేసి చూస్తే, ఇక్కడ మనకు ధరలు తక్కువే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ రేట్లు ఉన్నాయి. థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. తక్కువ మంది ఉన్నప్పుడు రేటు రాబట్టుకోవాలంటే కొన్నిసార్లు ధరలు పెంచాల్సి వస్తుంది"

"టికెట్ ధరలు అన్ని సినిమాలకు పెంచరు. ‘కల్కి’, ‘దేవర’, ‘పుష్ప 2’ లాంటి కొన్ని చిత్రాలకు పెంచుతారు. ఈవెంట్‌ చిత్రాలకు మాత్రమే పెంచుతారే తప్ప, అన్ని సినిమాలకు కాదు. ఈ మధ్య ఓ సినిమాకు రేటు రూ.95 పెట్టారు. ఎవరూ చూడలేదు. టికెట్ రేట్ల మీద అభ్యంతరం ఉంటే అందరూ ఆ సినిమా చూసేవాళ్ళు కదా?. ఇష్టం బాగా ఉన్నప్పుడే మనం కూడా ఎక్కువ రేటు పెట్టి సినిమా చూడాలని అనుకుంటాం. టైటిల్ రేట్లు తగ్గించాలంటే నిర్మాత, దర్శకుడు, ఇండస్ట్రీ మాత్రమే నిర్ణయం తీసుకోలేరు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం ఉండాలి. ఇది ప్రజల డియరెస్ట్ నియరెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని భావించి ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌లో రిబేటు లాంటివి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నాకంటే ఈ విషయాన్ని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు బాగా చెప్పగలరు. నాగవంశీ కామెంట్లు అసంబద్దమైనవి అని అనుకోవడం లేదు. అందుకే దానికి ఎలాబరేట్ చేసి ఈ వివరణ ఇచ్చాను" అని SKN వివరించారు.