అవాకులు...చెవాకులు పేలొద్దు!
ఇటీవల `బ్రహ్మా ఆనందం` సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Feb 2025 9:45 AM GMTఇటీవల `బ్రహ్మా ఆనందం` సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన కుటుంబ వారసత్వంపై తన అభిప్రాయాన్ని పంచుకునే క్రమంలో చిరు పేరు హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ ఈసారైనా మగబిడ్డను ఇవ్వాలని.. వారసత్వం కొనసాగించడం కోసం మగ బిడ్డ కావాలనే ఉద్దేశంలో చిరు అలా సరదాగా అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొంత మంది అసహనం వ్యక్తం చేసారు.
కొంత మంది సరదాగా తీసుకున్నా..మరికొంత మంది మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు. పిల్లల విషయంలో ఈ బేధం ఏంటి? అంటూ చిరంజీవిపై పలువురు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో అలాంటి విమర్శలకు చెక్ పెట్టడానికి యువ నిర్మాత ఎస్ కెఎన్ రంగంలోకి దిగాడు. చిరును విమర్శిస్తున్న వారందర్నీ చెడుగుడూ ఆడే ప్రయత్నం చేసాడు. ఎస్.కె.ఎన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కొంతమంది కావాలని ఇలాంటి విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు.
`పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం చిరంజీవిది. నిజమైన ఫ్యామిలీ మ్యాన్ ఆయన. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఆయనపై ఊరికే అవాకులు చవాకులు పేలడం అనవ సరంగా రాద్థాంతం చేయటం తద్వారా పిచ్చి ఆనందం పొందటం కొందరికి అలవాటు` అని విమర్శించారు. దీంతో ఎస్ కె ఎన్ పై కూడా ఎటాకింగ్ దిగారు. మరి ఈ మాటల యుద్దానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
చిరంజీవిపై ఇప్పటివరకూ ఎలాంటి ట్రోలింగ్ జరిగేది కాదు. కానీ కొంత కాలంగా ఆయనపై కూడా ట్రోలింగ్ ఎక్కువైంది. సెలబ్రిటీలపై ఇలాంటి ట్రోలింగ్ సహజమే. బిగ్ బీ అమితాబచ్చన్ సైతం ట్రోలింగ్ బాధితుడే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్నది కామన్ గా మారింది. పొరపాటున నోరు జారితే ఆనటుడిపై పని అయిపోయినట్లే.