పవన్ పాలిటిక్స్.. రంగంలోకి మరో ఐకానిక్ ప్రొడ్యూసర్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 10 May 2024 10:44 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి ఎలా అయినా గెలవాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంతో పాటు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
అయితే పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సినీ రంగానికి చెందిన అనేక మంది ప్రచారం నిర్వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేశారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరుతూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు.
జబర్దస్త్ ఆర్టిస్టులు గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది సహా పలువురు పవన్ మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా పిఠాపురం వెళ్లారు. పవన్ ను గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ పాంప్లెట్స్ పంచి పెడుతూ ప్రజలను కోరారు. నాగవంశీతో పాటు ఆయన టీమ్ కూడా ప్రచారంలో పాల్గొంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో నిర్మాత శ్రీనివాస కుమార్- SKN చేరారు.
పిఠాపురంలో నేడు పవన్ మద్దతుగా ప్రచారం చేశారు ఎస్కేఎన్. ఇంటింటికి వెళ్లి జనసేనానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. 'దాచుకోవడం రాదు.. దోచుకోవడం తెలియదు.. నిజమైన నాయకుడు పవన్' అంటూ బేబీ నిర్మాత ఎస్కేఎన్ నినదించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక పవన్ కు సినీ రంగం నుంచి మద్దతు క్రమంగా పెరుగుతోంది. కొందరు సెలబ్రిటీలు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తుంటే.. మరి కొందరు సోషల్ మీడియాలో పవన్ కు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు. ప్రచారానికి మరికొద్ది గంటలే సమయం ఉండటంతో పిఠాపురంలో కూటమి నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో పవన్ ఎంతటి మెజార్టీతో గెలుస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.