Begin typing your search above and press return to search.

SKN మంచి మనసు.. పిఠాపురం మహిళకు చెప్పినట్లే స్పెషల్ గిఫ్ట్

మెగాస్టార్ ఫ్యాన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. బేబీ కన్నా ముందు పలు చిత్రాలను నిర్మించారు.

By:  Tupaki Desk   |   11 July 2024 4:02 PM GMT
SKN మంచి మనసు.. పిఠాపురం మహిళకు చెప్పినట్లే స్పెషల్ గిఫ్ట్
X

గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీ మూవీతో నిర్మాత ఎస్కేఎన్ స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో భారీ విజయం సాధించి మంచి లాభాలు అందుకున్నారు. మెగాస్టార్ ఫ్యాన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. బేబీ కన్నా ముందు పలు చిత్రాలను నిర్మించారు. కానీ ఆ సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.


అయితే సినిమాలతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు ఎస్కేఎన్. ఎవరైనా ఆపదలో ఉండి సాయం అడిగితే హెల్ప్ చేస్తుంటారు. ఎప్పుడూ తన గొప్ప మనసును చాటుకుంటారు. దాతృత్వ కార్యక్రామాల్లో చురుగ్గా పాల్గొంటారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన విషయాలపై స్పందిస్తుంటారు. తగినంత సాయం చేసి అండగా నిలుస్తుంటారు. తాజాగా ఎస్కేఎన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే ఓ మహిళకు భారీ కానుక అందించారు. ఆటో కొనుగోలు చేసి ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. మంచి మనసున్న నిర్మాత అంటూ ఎస్కేఎన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరియమ్మ భర్త రిక్షా నడుపుతాడు. అయితే ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే.. తన భర్త సంపాదనను స్థానిక నాయకులకు ఇస్తానని ఓ యూట్యూబ్ ఛానెల్ తో ఆమె చెప్పింది. సంతోషంగా డ్యాన్స్ కూడా చేసింది. ఆ వీడియో ఎస్కేఎన్ దృష్టికి చేరింది. ఆయన వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే.. తన డబ్బులతో ఆటో కొనుగోలు చేసి ఇస్తానని అప్పుడే మాటిచ్చారు. ఎన్నికల్లో పవన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.

దీంతో గురువారం పిఠాపురం వెళ్లారు ఎస్కేఎన్. మరియమ్మకు ఆటో అందించి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే ఎస్కేఎన్.. ఎన్నికల సమయంలో పవన్ తరఫున పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. ఇంటింటా తిరిగి పవన్ ను గెలిపించాలని కోరారు. అయితే పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలవడమే కాకుండా.. డిప్యూటీ సీఎంగా కూడా ఇప్పుడు సేవలందిస్తున్నారు. మరో నాలుగు శాఖలకు మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.