Begin typing your search above and press return to search.

'స్లమ్‌డాగ్ మిలియనీర్' సీక్వెల్ అప్‌డేట్

ఈ సినిమాతో ఏ.ఆర్.రెహ‌మాన్ ఉత్త‌మ సంగీత దర్శ‌కుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ప‌లు విభాగాల్లో ఆస్కార్ లు కొల్ల‌గొట్టిన చిత్ర‌మిది

By:  Tupaki Desk   |   27 Nov 2024 2:01 PM GMT
స్లమ్‌డాగ్ మిలియనీర్ సీక్వెల్ అప్‌డేట్
X

డానీ బోయ్ లే తెర‌కెక్కించిన `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` ఎంత‌టి సంచ‌ల‌న‌మో తెలిసిందే. ఈ సినిమాతో ఏ.ఆర్.రెహ‌మాన్ ఉత్త‌మ సంగీత దర్శ‌కుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ప‌లు విభాగాల్లో ఆస్కార్ లు కొల్ల‌గొట్టిన చిత్ర‌మిది. ఈ సినిమాలో నటించిన కాస్టింగ్, టెక్నీషియ‌న్ల‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు ద‌క్కింది. వారికి విరివిగా అవ‌కాశాలు వ‌చ్చాయి. ముంబై స్ల‌మ్స్‌ లో పెరిగిన సాధార‌ణ కుర్రాళ్ల క‌థ‌ను ఎంతో ఎమోష‌న‌ల్ గా తెర‌కెక్కించిన డానీ బోయ్ లే ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు కురిసాయి.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎట్ట‌కేల‌కు లాస్ ఏంజిల్స్‌కు చెందిన నిర్మాణ సంస్థ బ్రిడ్జ్7 స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి సీక్వెల్ ని తెర‌కెక్కించేందుకు, అలాగే టీవీ ప్ర‌సార హక్కులను కూడా ఛేజిక్కించుకుంది. కొత్తగా ప్రారంభ‌మైన‌ బ్యానర్ బ్రిడ్జ్ 7 నిర్మాత స్వాతి శెట్టి, ప్రముఖ CAA ఏజెంట్ గ్రాంట్ కెస్మాన్ ల‌కు చెందిన‌ది కాగా వారు సీక్వెల్ పై ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఫిల్మ్ 4 భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మించిన UK ఆధారిత సెలాడోర్ నుండి హక్కులు కొనుగోలు చేసారు. ``ఈ ఫ్రాంఛైజీకి సంబంధించిన కొన్ని కథలు, క్రెడిట్స్ రోల్ తర్వాత చాలా కాలం పాటు మాతో ఉంటాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్ ప్ర‌త్యేక‌మైన సినిమా. దీని కథనం సార్వజ‌నీన‌మైనది.. సాంస్కృతిక భౌగోళిక అంశాల‌ను స్పర్శించిన ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది.. సీక్వెల్ ని తెర‌కెక్కిస్తా``మ‌ని స్వాతి శెట్టి - గ్రాంట్ కెస్‌మాన్ ఒక ప్రకటనలో హాలీవుడ్ రిపోర్ట‌ర్ కి తెలిపారు.

2008లో విడుదలైన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి డానీ బాయిల్ దర్శకత్వం వహించారు. ఈ గ్రిప్పింగ్ డ్రామాకి వికాస్ స్వరూప్ 2005 నవల Q & A స్ఫూర్తి. ఈ చిత్రం 18 ఏళ్ల జమాల్ మాలిక్ (దేవ్ పటేల్ పోషించిన పాత్ర) ముంబైలోని జుహూ మురికివాడలకు చెందిన యువకుడి జీవ‌న ప్ర‌యాణాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. కౌన్ బనేగా కరోడ్‌పతిలో పోటీదారుగా ఉన్న‌ జమాల్ మాలిక్ అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చి రూ.1 కోటి గెలుచుకుని రూ.2 కోట్ల గ్రాండ్ ప్రైజ్‌కి కేవలం ఒక ప్రశ్న దూరంలో నిలబడి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అయితే అత‌డు చివ‌రికి మోసం చేసినట్లు అనుమానంతో జమాల్ ని విచారిస్తారు పోలీసులు. ఆ క్ర‌మంలోనే అత‌డు త‌న‌ జీవిత కథను పోలీసులకు వివరిస్తుంటాడు. ప్రతి ప్రశ్నకు అతడి అనుభవాలే ఎలా సమాధానాలు ఇచ్చాయో వెల్లడించే క‌థ‌తో డానీ బోయ్ లే అద్భుతాలు చేసాడు.

`స్లమ్‌డాగ్ మిలియనీర్` చిత్రంలో న‌టించిన‌ దేవ్ పటేల్ కి మంచి పేరొచ్చింది. ఇది అతడికి ప‌రిచ‌య చిత్రం. ఇందులో ఫ్రీదా పింటో, మధుర్ మిట్టల్, అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి సీనియ‌ర్లు న‌టించారు. ఆ సంవ‌త్స‌ర అన్ని ముఖ్య‌మైన‌ అవార్డు వేడుకల్లో స్లమ్‌డాగ్ మిలియనీర్ మెరుపులు మెరిపించింది. ఇది 81వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ చలనచిత్ర ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ , ఉత్తమ సౌండ్ మిక్సింగ్‌ సహా ఎనిమిది ఆస్కార్‌లను గెలుచుకుంది. 62వ బాఫ్టా అవార్డ్స్‌లో ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ చలనచిత్ర సంగీతం, ఉత్తమ ఎడిటింగ్ ,ఉత్తమ సైండ్ సహా ఏడు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ 66వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే , ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌తో సహా నాలుగు అవార్డులను గెలుచుకుంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ టెల్లూరైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్ వేసారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శిత‌మైంది.