టాలీవుడ్ లో కనిపించని చిన్న సినిమా!
ఒకప్పుడు ఇండస్ట్రీ చిన్న సినిమాల ఓపెనింగ్ లతో కళకళలాడేది. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా నిర్మాణానికి నవతరం నిర్మాతలు ముందుకొచ్చేవారు.
By: Tupaki Desk | 26 Feb 2025 6:30 PM GMTఒకప్పుడు ఇండస్ట్రీ చిన్న సినిమాల ఓపెనింగ్ లతో కళకళలాడేది. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా నిర్మాణానికి నవతరం నిర్మాతలు ముందుకొచ్చేవారు. ఏడాదిలో సింహ భాగ రిలీజ్ లు చిన్న సినిమాలదే. చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు ఎంతొ గొప్పగా చెప్పేవారు. చిన్న సినిమాలకు థియేటర్లు సరిపడా ఇవ్వాలని తనవంతు ప్రయత్నం చేసేవారు.
ఫిల్మ్ మీడియా కూడా అప్పట్లో అంతే బిజీగా ఉండేది. ఒకే రోజు పది -పదిహేను ప్రెస్ మీట్లు సైతం కవర్ చేయాల్సిన సన్నివేశం ఉండేది. అయితే నేడు సీన్ మొత్తం మారిపోయింది. కరోనా తో చిన్న సినిమా పూర్తిగా కుదేలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చిన్న సినిమా కోలుకుంది లేదు. కొంత మంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు గానీ...వాటికి సరైన థియేటర్లు దొరక్కపోవడంతో సినిమాలు తీయడం మానేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
తమ అనుభవాల్ని ఇండస్ట్రీకి వద్దాం అనుకున్న వాళ్లకు చెప్పడంతో వచ్చే వాళ్లు కూడా రాకుండా అక్కడే ఆగిపోతున్నారు. అలా చిన్న సినిమా దాదాపు కనుమరుగైనట్లే కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న సినిమా కోసం థియేటర్లు ఇవ్వాలని ఛాంబర్ ఎదుట ఉద్యాలు జరిగాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్న సినిమా నిర్మాణమే ఆగిపోవడంతో? ఆ పరిస్థితి లేదు. పైగా ఇప్పుడంతా రీజనల్ మార్కెట్ ని దాటి పాన్ ఇండియా అంటూ కొత్త పుంతలు తొక్కడంతో పరిమిత బడ్జెట్ లో సినిమాలు నిర్మించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఓటీటీ ...శాటిలైట్ సంస్థలు బిజినెస్ పరంగా రకరకాల కండీషన్లు పెట్టడంతో బెదిరిపోయి వెనక్కి తగ్గే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఓ చిన్న సినిమా నిర్మాత అనుభవాన్ని పంచుకున్నాడు. భవిష్యత్ లో ఇప్పుడున్న చిన్న సినిమాల సంఖ్య కూడా పూర్తిగా శూన్యమైపోతుందని అన్నారు. చిన్న సినిమా నిర్మాణ కంటే తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులో డబ్ చేసుకోవడమే ఉత్తమంగా ఉందంటున్నారు.