Begin typing your search above and press return to search.

2024లో తగ్గారు.. 2025లో మాత్రం తగ్గేదేలే!

అలా అని వారి చేతిలో సినిమాలు లేవా అనుకుంటే పొరపాటే.

By:  Tupaki Desk   |   18 Dec 2024 3:00 AM GMT
2024లో తగ్గారు.. 2025లో మాత్రం తగ్గేదేలే!
X

ఏడాది పొడవునా సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ యువ హీరోలు చాలామంది 2024లో వెండితెర మీద కనిపించలేదు. ఒక్క రిలీజ్ కూడా లేకుండానే ఈ ఇయర్ ను ముగిస్తున్నారు. అలా అని వారి చేతిలో సినిమాలు లేవా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒక్కొక్కరూ రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కాకపోతే అనుకున్న సమయానికి షూటింగ్స్ కంప్లీట్ అవ్వకపోవడం, ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా సినిమాని విడుదల చేయలేకపోవడం వల్లనే ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. అయితే వీరంతా 2025లో మాత్రం అసలు తగ్గదేలే అంటున్నారు. ఒకటికి రెండు సినిమాలు అందించడానికి రెడీ అవుతున్నారు.

అక్కినేని నాగచైతన్య:

గతేడాది 'కస్టడీ' సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ఆ వెంటనే 'తండేల్' మూవీతో బిజీ అయిపోయారు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ డ్రామాని 2024 క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పెండింగ్ ఉండటంతో వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే వీక్ లో ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. చైతూ ఈ మధ్యనే కార్తీక్‌ దండుతో 'NC 24' చిత్రాన్ని ప్రకటించారు. ఇదొక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ కూడా వచ్చే ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.

అడివి శేష్‌:

2022లో 'మేజర్‌' 'హిట్‌ 2' వంటి రెండు సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు అడివి శేష్‌. అప్పటి నుంచీ 'G 2' 'డెకాయిట్‌: ఎ లవ్‌ స్టోరీ' చిత్రాల్లో నటిస్తున్నారు. 'గూఢచారి' మూవీకి సీక్వెల్‌గా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో 'గూఢచారి 2' తెరకెక్కుతోంది. మరోవైపు షానియల్ డియో డైరెక్షన్ లో 'డకాయిట్‌' సినిమా చేస్తున్నారు. మంగళవారం శేష్ బర్త్ డే సందర్భంగా రెండు సినిమాల అప్డేట్స్ వచ్చాయి. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ వెల్లడించలేదు. కాకపోతే ఈ పాన్ ఇండియా మూవీస్ వచ్చే ఏడాదే బిగ్ స్క్రీన్ మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అఖిల్‌ అక్కినేని:

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని పోయిన సంవత్సరం 'ఏజెంట్' మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. అప్పటి నుంచీ సైలెంట్ గా ఉన్న యువ హీరో.. ఏడాదిన్నర తర్వాత ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిశోర్‌ దర్శకత్వంలో 'Akhil 6' తెరకెక్కుతోంది. దీనికి 'లెనిన్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తో అఖిల్ మూవీ ఫిక్స్ అయింది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త టైం పట్టొచ్చు. వీటిల్లో ఒక సినిమా 2025లో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నితిన్‌:

యూత్ స్టార్ నితిన్‌ లాస్ట్ ఇయర్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' అంటూ వంటి డిజాస్టర్ చవిచూశారు. 'భీష్మ' ఫేమ్ వెంకీ అట్లూరితో ఆయన నటిస్తున్న 'రాబిన్‌హుడ్‌' సినిమాని క్రిస్మస్‌ స్పెషల్ గా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే వచ్చే ఏడాది ఎప్పుడు విడుదల చేస్తారనేది వెల్లడించలేదు. దీంతో పాటు 'వకీల్ సాబ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' అనే సినిమా చేస్తున్నారు నితిన్. అలానే 'బలగం' వేణు యెల్దండితో 'ఎల్లమ్మ' చిత్రం కమిట్ అయ్యారు. వచ్చే ప్రారంభంలో ఈ సినిమాని మొదలుపెట్టి, దసరా సీజన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే వచ్చే సంవత్సరం నితిన్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయన్నమాట.

సాయి దుర్గా తేజ్‌:

గతేడాది 'విరూపాక్ష', 'బ్రో' చిత్రాలతో సందడి చేసిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌.. ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేకపోయారు. ప్రస్తుతం కె.పి.రోహిత్‌ దర్శకత్వంలో 'SYG - సంబరాల ఏటిగట్టు' అనే చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీని దసరా సందర్భంగా 2025 సెప్టెంబరు 25న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నవీన్ పోలిశెట్టి:

గతేడాది చివర్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో హిట్టు కొట్టి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన హీరోగా నిలిచాడు నవీన్ పోలిశెట్టి. కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న యువ హీరో, దురదృష్టవశాత్తూ ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ళు షూటింగ్స్ దూరమయ్యారు. అందుకే ఈ ఇయర్ ఒక్క మూవీ కూడా రాలేదు. ఇప్పుడు అంతా ఓకే అవ్వడంతో తిరిగి 'అనగనగా ఒక రాజు' సినిమాను ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు కావొస్తోంది. లాస్ట్ ఇయర్ 'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యువ హీరోకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మళ్ళీ తిరిగి టాలీవుడ్ కు వచ్చి బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. వచ్చే ఏడాది 'భైరవం', 'టైసన్‌ నాయుడు' చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇవి కాకుండా మరో మూడు రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. మరికొన్ని సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి.

వైష్ణవ్ తేజ్:

మరో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ గతేడాది 'ఆదికేశవ' సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు కానీ, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

నాగశౌర్య:

గతేడాది 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' 'రంగబలి' సినిమాతో అలరించిన నాగశౌర్య.. ఈ ఏడాది ఒక్క మూవీని కూడా రిలీజ్ చెయ్యలేదు. గతంలో ప్రకటించిన 'పోలీస్ వారి హెచ్చరిక' 'నారి నారి నడుమ మురారి' సినిమాలు ఎక్కడి దాకా వచ్చాయనే అప్డేట్స్ లేవు. అయితే ఇటీవలే రామ్‌ దేశిన దర్శకత్వంలో ఓ కొత్త సినిమాని పట్టాలెక్కించారు. ఈ మూవీ 2025లో విడుదల అవుతుందని అంటున్నారు.