Begin typing your search above and press return to search.

'కల్కి' కి ముందు ఈ సినిమాల హడావిడి

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కల్కి సినిమా విడుదల తేదీ సమీపిస్తుంది.

By:  Tupaki Desk   |   30 May 2024 5:14 AM GMT
కల్కి కి ముందు ఈ సినిమాల హడావిడి
X

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కల్కి సినిమా విడుదల తేదీ సమీపిస్తుంది. జూన్‌ 27న విడుదల కాబోతున్న కల్కి సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ అయ్యాయి.

సాధారణంగా కల్కి వంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే విడుదలకు ముందు రెండు వారాలు, తర్వాత రెండు వారాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సైలెంట్‌ వాతావరణం ఉంటుంది. కానీ కల్కి విషయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

మొన్నటి వరకు ఎన్నికలు, ఐపీఎల్‌ కారణంగా చిన్న సినిమాలు కూడా విడుదల కాకుండా ఆగాయి. అవన్నీ కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. జూన్‌ మొదటి వారం మరియు రెండో వారం పలు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

ఈ రెండు వారాల్లో రాబోతున్న సినిమాలు ఏవో ఊరు పేరు లేని సినిమాలు కానే కావు. వాటిల్లో కొన్ని చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. కల్కి సినిమా హడావిడి సమయంలోనే ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నాయి.

జూన్‌ 7వ తారీకున సత్యభామ, లవ్‌ మౌళి మరియు శర్వానంద్‌ నటించిన మనమే సినిమాలు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే మనమే సినిమా విడుదల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక పాయల్‌ నటించిన మరో సినిమా కూడా జూన్ మొదటి వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది.

జూన్‌ 14న ధనుష్ నటించిన రాయన్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ప్రమోషన్‌ సందడి లేక పోవడంతో ఆ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సుధీర్‌ బాబు నటించిన హరోమ్‌ హర సినిమా మాత్రం ఆ రోజు రానుంది. ఇంద్రాణి అనే కొత్తవారి సినిమా కూడా జూన్‌ 14న విడుదల అవ్వబోతుంది.

మొత్తానికి కల్కి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఈ చిన్న సినిమాలను, మీడియం రేంజ్ సినిమాలను పట్టించుకుంటారా అనేది ఆసక్తికర అంశంగా మారింది. ఒక వేళ వీటిల్లో ఏ రెండు మూడు సినిమాలు హిట్‌ టాక్‌ దక్కించుకున్నా ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కల్కి వరకు ఆ సినిమాల జోరు కొనసాగే అవకాశం ఉంది.