దుష్ప్రచారం.. ఒక స్మగ్లర్ పాత్రకు జాతీయ పురస్కారమా?
అయితే గ్యాంగ్ స్టర్ పాత్రలకు లేదా స్మగ్లర్లు బంధిపోట్ల పాత్రలకు జాతీయ అవార్డు ఇవ్వకూడదని రూల్ ఏదైనా ఉందా?
By: Tupaki Desk | 25 Aug 2023 5:18 PM GMTహత్యలు నేరాలు చేసే పాత్రలకు జాతీయ అవార్డులు ఇవ్వరు.. అవునా.. ఇది నిజమా? అని ప్రశ్నించకండి.. ఇలాంటి కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది ఒక సెక్షన్ జాతీయ మీడియా. కొందరు యూట్యూబర్లు చాలా అతి చేసారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంపై చాలా దుష్ప్రచారమే సాగింది. ఎర్రచందనం స్మగ్లర్ పాత్రధారికి ఉత్తమ నటుడు అవార్డు ఎలా వస్తుంది? అంటూ ప్రశ్నించారు చాలా మంది.
అయితే గ్యాంగ్ స్టర్ పాత్రలకు లేదా స్మగ్లర్లు బంధిపోట్ల పాత్రలకు జాతీయ అవార్డు ఇవ్వకూడదని రూల్ ఏదైనా ఉందా? అన్నది పరిశీలిస్తే.. నిజానికి వీళ్లు చేస్తున్న ప్రచారం నిజంగా నవ్వు తెప్పిస్తోంది. అయితే గతంలో జాతీయ ఉత్తమ నటుడు లేదా ఉత్తమ నటి అవార్డు అందుకున్న పాత్రలను పరిశీలిస్తే చాలా ఆసక్తికర సంగతులే తెలిసాయి.
మణిరత్నం నాయకుడు చిత్రంలో కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించారు. 1987లో ఈ చిత్రం విడుదలైంది. కరుడుగట్టిన మాఫియా డాన్ వరదరాజన్ ముదలియార్ స్ఫూర్తితో రూపొందించిన పాత్ర అది. షబానా ఆజ్మీ 'గాడ్ మదర్' పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం దక్కించుకున్నారు.
గుజరాత్ కి చెందిన లేడీ డాన్ సంతోక్ బెన్ జడేజా కథ ఆధారంగా తీసిన చిత్రమిది. హత్యా కేసులు సహా 500 కేసులున్న ఒక మహిళగా షబానా నటించగా జాతీయ అవార్డులు దక్కాయి. కలియాట్టంలో సురేష్ గోపి అనుమానం మొగుడు పాత్రలో నటించి జాతీయ అవార్డు అందుకున్నాడు. అంతెందుకు వరుస హత్యలు చేసే బండిట్ క్వీన్ గా సీమా బిస్వాస్ నటించగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కట్టబెట్టలేదా?
ఇవేవీ సమాజానికి మేలు చేసే పాత్రలు కానేకావు. కానీ అవార్డులు దక్కాయి. అయితే కళను కళగానే చూడాలి. ప్రాంతీయ తత్వంతో చూడకూడదు. ఈసారి ఎలాంటి ప్రాంతీయతా లేకుండా జాతీయ అవార్డులను జెన్యూన్ గా ఇవ్వడం వల్లనే తెలుగు సినిమాకి ఇంతటి ఘనత సాధ్యమైంది. గొప్ప నట ప్రదర్శనతో నెగ్గుకొచ్చాడు గనుకే బన్నీకి జాతీయ అవార్డు దక్కిందనడంలో సందేహం లేదు.