Begin typing your search above and press return to search.

శోభ‌న జోరు పెంచిన‌ క‌ల్కి

శోభ‌న‌కు క‌ల్కి మంచి గుర్తింపును ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో త‌ను న‌టించిన క్రేజీ సినిమాల‌తో తిరిగి అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది.

By:  Tupaki Desk   |   20 July 2024 12:30 AM GMT
శోభ‌న జోరు పెంచిన‌ క‌ల్కి
X

చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత 'క‌ల్కి 2989 ఏడి' చిత్రంలో క‌నిపించింది శోభ‌న‌. మెగాస్టార్ చిరంజీవి - రాజ‌శేఖ‌ర్- సుమ‌న్- మోహ‌న్ బాబు లాంటి సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించిన మేటి క‌థానాయిక‌గా శోభ‌న‌ తెలుగు వారికి సుప‌రిచితం. కానీ ఇటీవ‌ల తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. ఇంత‌కుముందే మోహ‌న్ లాల్ 360వ సినిమాలో శోభ‌న న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే నాగ్ అశ్విన్ క‌ల్కి చిత్రంలో ఆస‌క్తిక‌ర పాత్ర‌లో అవ‌కాశం క‌ల్పించారు. వ‌ర్చువ‌ల్ టెక్నాల‌జీలో ఇమేజ్ త‌ర‌హాలో క‌నిపించే అధునాత‌న శైలి పాత్ర‌తో శోభ‌న స‌ర్ ప్రైజ్ చేసింది. శంభాలా న‌గ‌రాన్ని కాపాడే రాణి 'మ‌రియం'గా క‌నిపించింది. శోభ‌న‌ దాదాపు 18ఏళ్ల త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ఘ‌న‌మైన రీఎంట్రీ ఇచ్చింద‌నే చెప్పాలి. క‌ల్కిలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ర్షించిన సీనియ‌ర్ న‌టి శోభ‌న పేరు ఇప్పుడు మ‌ళ్లీ మార్మోగుతోంది.

ఇదే స‌మ‌యంలో శోభ‌న న‌టించిన క్లాసిక్ మ‌ల‌యాళ‌ మూవీ 'మణిచిత్రతాఝు' ని రీ-రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఈ సినిమా రీరిలీజ్‌ తేదీని శోభన స్వ‌యంగా ధృవీకరించడంతో ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఫాజిల్ దర్శకత్వంలో సురేష్ గోపి, శోభన, మోహన్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన మ‌లయాళం క్లాసిక్ 'మణిచిత్రతాఝు' ఆగస్టులో గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. 1993లో విడుదలైన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 30 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తోంది. తన నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్న శోభనకు ఈ సినిమా చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. 17 ఆగష్టు 2024న 4K డాల్బీ అట్మాస్‌లో చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నట్లు శోభ‌న స్వ‌యంగా ధృవీకరించారు.

శోభన పోస్ట్ త‌న‌ అభిమానులు సినీ ప్రేక్షకులను ఆక‌ర్షించింది. శోభనకు వీరాభిమాని ఒక‌రు ఇలా వ్యాఖ్యానించారు. ''నాతో సహా అందరూ థియేటర్‌లో చూసి తీరాల‌నుకున్న సినిమా ఇది'' అని రాశారు. మరో నెటిజన్ రీ-రిలీజ్ తేదీని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ''దేవుడు నా కోరికలను ఎలా నిజం చేస్తున్నాడో ఆశ్చర్యంగా ఉంది'' అని వ్యాఖ్యానించాడు. శోభ‌న‌ను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా 'మణిచిత్రతాఝు' అని ఒక సినీ ప్రియుడు పేర్కొన్నాడు. నాకు 3 సంవత్సరాల వయసులో నేను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ఇది. అప్పటి నుండి, నేను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. నేను దీన్ని కూడా వ‌దిలిపెట్ట‌ను! అని రాసాడు. ఇది ఇంకేదైనా EPIC కాగలదా? ఈ కళాఖండాన్ని 4Kలో అనుభవించడానికి వేచి ఉండలేము! అని ఒక సినీ ప్రియుడు రాశాడు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి శోభ‌న‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

శోభ‌న‌కు క‌ల్కి మంచి గుర్తింపును ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో త‌ను న‌టించిన క్రేజీ సినిమాల‌తో తిరిగి అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. ఇదే స‌మ‌యంలో తెలుగు-మ‌ల‌యాళంలో మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. సీనియ‌ర్ హీరోల‌తో త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల కార‌ణంగా శోభ‌న స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టించ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. ఎయిటీస్ క్లాస్ హీరోలు త‌న‌కు అవ‌కాశాలిస్తున్నార‌ని తెలిసింది.