పెళ్లి తర్వాత శోభిత మొట్ట మొదటిసారిలా!
అయితే తాజాగా శోభిత ఓ సినిమా సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు. ఓ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో శోభిత అక్కడ కనిపించడం హైలైట్ అవుతుంది.
By: Tupaki Desk | 28 Feb 2025 6:02 AMయువ సామ్రాట్ నాగ చైతన్యను వివాహం చేసుకుని నటి శోభిత ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత శోభిత పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. అందులోనూ సినిమా వేడుకల్లో అసలే కనిపించలేదు. అయితే భర్త నటించిన `తండేల్` సినిమా సక్సెస్ ఈవెంట్ లో మాత్రం ప్రత్యక్షమైంది. పెళ్లైన తర్వాత పబ్లిక్ వేడుకకు హాజరవ్వడం అదే తొలిసారి.
భర్త సక్సెస్ ను తాను కూడా ఎంజాయ్ చేసారు. ఆ వేడుకలో శోభిత సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఎలాంటి మోడ్రన్ డ్రెస్ ల జోలికి వెళ్లకుండా పద్దతైన చీరలో కనిపించే సరికి శోభిత ఆ ఈవెంట్ లో ప్రత్యేకంగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి వేడుకలోనూ పాల్గొనలేదు. అయితే తాజాగా శోభిత ఓ సినిమా సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు. ఓ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో శోభిత అక్కడ కనిపించడం హైలైట్ అవుతుంది.
దీంతో ఆమె నటిస్తోన్న సినిమా షూటింగ్ కోసం హాజరయ్యారా? లేక తనకు సంబంధం లేని షూట్ లో ఉన్నారా? అన్నది కన్ ప్యూజన్ గా మారింది. శోభిత ఆన్ సెట్స్ లో పంజాబీ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఆమె షూటింగ్ లో పాల్గొన్నట్లు కనిపించడం లేదు. `మంకీ మ్యాన్`, `లవ్ సితార` తర్వాత శోభిత కొత్త సినిమాలేవి కమిట్ అయినట్లు అధికారికంగా వెల్లడించలేదు. తెలుగులో అయితే `మేజర్` తర్వాత సినిమాలే చేయలేదు.
కోలీవుడ్ లో మాత్రం `పొన్నియన్ సెల్వన్` రెండు భాగాల్లోనూ నటించారు. అదీ రెండేళ్ల క్రితం నాటి మాట. ఆ గ్యాప్ లో నే చైతన్యతో ప్రేమలో పడి ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి శోభితకు సంబంధించి కొత్త సినిమా అప్ డేట్స్ ఏవీ రాలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతారనే ప్రచారం జరిగింది గానీ దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.