శోభిత పెళ్లి చీర... ఆ ఆడంబరాలకు దూరం
మరికొన్ని గంటల్లో నాగ చైతన్య, శోభిత దూళ్లిపాల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరుగుతుంది.
By: Tupaki Desk | 3 Dec 2024 5:29 AM GMTమరికొన్ని గంటల్లో నాగ చైతన్య, శోభిత దూళ్లిపాల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోలోని ఏయన్నార్ వారి విగ్రహం ముందు జరగబోతున్న ఈ పెళ్లి తంతుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే ఈ పెళ్లి మొత్తాన్ని ఒక డాక్యుమెంటరీ తరహాలో ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు రైట్స్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దాదాపుగా రూ.50 కోట్లకు గాను ఆ పెళ్లి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సదరు ఓటీటీ కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.
ఇక పెళ్లిలో నాగ చైతన్య, శోభిత ధరించబోతున్న డ్రెస్‌లు ఎలా ఉంటాయా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి చీరల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అందుకే శోభిత పెళ్లి చీర ఎలా ఉంటుంది, ఆమె ఎంత ఖర్చుతో పెళ్లి చీర కొనుగోలు చేసింది, ఆ పెళ్లి చీర డిజైనర్ ఎవరై ఉంటారు అనే చర్చ సెలబ్రిటీల్లో జరుగుతోంది. అయితే శోభిత పెళ్లి చీరను ప్రత్యేకంగా బాలీవుడ్ డిజైనర్‌తో డిజైన్ చేయించలేదు. తన తల్లితో కలిసి తానే స్వయంగా చీరను సింపుల్‌గా కొనుగోలు చేసింది. పెళ్లి చీర విషయంలో ఆడంబరాలకు పోకుండా శోభిత సింప్లీ సూపర్ అనిపించింది.
ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం పెళ్లి చీరల కోసం ఆమె ప్రత్యేకంగా ఏ డిజైనర్‌తో వర్క్ చేయించుకోలేదు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోకి కొన్ని పెద్ద షాప్స్‌లో చీరలు కొనుగోలు చేసింది. అంతే కాకుండా బంగారు జరీ వర్క్‌తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకోబోతుంది. ఆ చీరను తానే స్వయంగా ఎంపిక చేసుకోవడంతో పాటు, దానికి ప్రత్యేకంగా డిజైనింగ్ హంగులు లేకుండా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి చీర అనగానే హడావుడి ఉంటుంది. కానీ శోభిత ఆడంబరాలకు దూరంగా ఉంది.
సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్లు సింగిల్‌గా ఉన్న నాగ చైతన్య ఒక కార్యక్రమంలో పరిచయం అయిన శోభితతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ కుటుంబ సభ్యుల ఒప్పందంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 4న వైభవంగా అన్నపూర్ణ స్టూడియోలో బంధు మిత్రుల సమక్షంలో వివాహం జరగబోతుంది. ప్రముఖులకు ఈ వివాహ వేడుక ఆహ్వాన పత్రిక అందిందని, అయితే ఎవరు ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటూ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు.