'కల్కి' వీడియో: 20 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన అమితాబ్!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలమన్ యాక్షన్ డిజైన్ చేసారు.
By: Tupaki Desk | 7 July 2024 10:58 AM GMTహిందూ పురాణాల్లోని ఐకానిక్ పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఫాంటసీ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫైట్ సీన్స్ చేయడానికి టీం ఎంతలా కష్టపడ్డారనేది తెలియజేస్తూ, మేకర్స్ తాజాగా ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలమన్ యాక్షన్ డిజైన్ చేసారు. ఆయన ఇంతకముందు 'రాజన్న', 'ఈగ', 'బాహుబలి 1', 'బాహుబలి 2' RRR వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా వర్క్ చేసారు. ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ చేయడం వెనుకున్న కష్టాన్ని కింగ్ సాలమన్ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ సన్నివేశాలు అంత అద్భుతంగా రావడంలో మొత్తం క్రెడిట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు దక్కుతుందని అన్నారు.
సినిమాలో కైరా పాత్రలో నటించిన అన్నా బెన్ చేసిన యాక్షన్ సీక్వెన్ ను ముందుగా డిజైన్ చేసినట్లు సోలమన్ చెప్పారు. ఒక లేడీ ఈ ఫైట్ చెయ్యాలి, ఆమె ఒక వెహికల్ నుంచి జంప్ చెయ్యాలి అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నీ ముందుగానే వివరించారని.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిహార్సల్స్ చేయించి సినిమాకి కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేలా చేసారని తెలిపారు. అన్ని విద్యలు తెలిసిన అశ్వద్ధామ, టెక్నికల్ గా స్ట్రాంగ్ అయిన భైరవ పాత్రల మధ్య ఫైట్ డిజైన్ చేయడానికి చాలా కష్టపడ్డామని స్టంట్ మాస్టర్ చెప్పారు. 9 అడుగుల ఎత్తు ఉండే అశ్వద్ధామ, 6 అడుగుల కంటే ఎత్తు ఉండే భైరవ.. ఇద్దరి హైట్స్ ను బ్యాలన్స్ చెయ్యడానికి వేర్వేరు బాడీ లాంగ్వేజ్ తో ఫైట్ కంపోజ్ చేసినట్లు వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ ఒక సీన్ కోసం రోప్ కట్టుకొని ఎలాంటి డూప్ లేకుండా 20 అడుగుల ఎత్తు నుంచి దూకేశారని.. అంత పెద్దాయన ఆ ఏజ్ లో అలాంటి స్టంట్స్ చేయడం చూసి షాక్ అయ్యానని సోలమన్ చెప్పారు. పురాణాల్లో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ తీసుకొని, ఇప్పటి యాక్షన్ టెక్నిక్స్ తో కలిపి ఫైట్స్ డిజైన్ చేసినట్లుగా తెలిపారు. సినిమాలో ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ చేయడంలో కెమెరామెన్, అసిస్టెంట్ స్టంట్ మాస్టర్స్ అసిస్టెంట్స్ కష్టముందన్నారు. ప్రతీ ఫేమ్, ప్రతీ యాక్షన్ సీక్వెన్ బాగా రావాలని నాగ్ అశ్విన్ ఎంతో తపన పడ్డారని 'కల్కి' స్టంట్ కొరియోగ్రాఫర్ చెప్పుకొచ్చారు.
కాగా, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో, నార్త్ అమెరికాలో ప్రభాస్ రాంపేజ్ కనిపిస్తోంది. హిందీలో ఈరోజుతో 200 కోట్ల మార్క్ క్రాస్ చేయబోతోంది.