Begin typing your search above and press return to search.

యాక్టర్స్ గా ఫుల్ బిజీగా మారిపోయిన డైరెక్టర్స్!

మరికొందరు మాత్రం మేకప్ వేసుకొని పూర్తిగా యాక్టింగ్ కే పరిమితం అవుతున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2024 5:30 PM GMT
యాక్టర్స్ గా ఫుల్ బిజీగా మారిపోయిన డైరెక్టర్స్!
X

సౌత్ సినిమాలో అనేక మంది దర్శకులు ఇప్పుడు యాక్టర్స్ గా బిజీగా మారుతున్నారు. మెగా ఫోన్ పట్టుకొని స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పే డైరెక్టర్స్.. కెమెరా ముందుకి వచ్చి తమలోని మరో కోణాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్నారు. వారిలో కొందరు ఓవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరికొందరు మాత్రం మేకప్ వేసుకొని పూర్తిగా యాక్టింగ్ కే పరిమితం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.


ఖుషి దర్శకుడు ఎస్.జె. సూర్య నటుడిగా తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా ఆయనే కనిపిస్తున్నారు. 'స్పైడర్‌' మూవీకి విలన్ గా మెప్పించిన సూర్య.. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్‌' చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవలే 'ఇండియన్ 2' లో కనిపించారు. వచ్చే ఏడాది విడుదల కానున్న 'ఇండియన్ 3'లోనూ భాగం కానున్నారు. 'సరిపోదా శనివారం', 'రాయన్', 'సర్దార్ 2', 'ఎల్ఐసి', 'వీర ధీర శూరన్' వంటి మరికొన్ని చిత్రాల్లో సూర్య నటిస్తున్నారు. శివ కార్తికేయన్, ఫహద్ ఫాసిల్ ల రాబోయే సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించనున్నారు.


'ఏమాయ చేసావే', 'సూర్య S/o కృష్ణన్', 'ఏటో వెళ్లిపోయింది మనసు' వంటి చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ సైతం పూర్తి స్థాయి నటుడిగా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'NBK 109' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే 'విడుదల 2', 'బజూకా' వంటి తమిళ మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'ధృవ నక్షత్రం' సినిమా విడుదలకి నోచుకోలేదు. అయితే యాక్టర్ గా బిజీగా ఉంటూనే, డైరెక్టర్ గానీ మధ్యనే మమ్ముట్టితో ఓ ప్రాజెక్ట్ ప్రారంభించారు.


'7/G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్.. ప్రస్తుతం యాక్టర్ గా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సోదరుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో అనౌన్స్ చేసిన RT4GM సినిమాతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు కానీ, ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. సీనియర్ దర్శకుడు భారతీరాజా, కెఎస్ రవికుమార్ కూడా నటులుగా రాణిస్తున్నారు.


పిశాచి, డిటెక్టివ్, సైకో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు మిస్కిన్.. నటుడిగానూ అలరిస్తున్నారు. ప్రస్తుతం డెవిల్, డ్రాగన్ అనే రెండు తమిళ సినిమాలలో నటిస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'పిశాచి 2' మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ‘బ్రో’ డైరెక్టర్ సముద్రఖని కూడా యాక్టర్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా 'ఇండియన్ 2' సినిమాలో మెరిశారు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' తో పాటుగా 'రామం రాఘవం' అనే చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


టాలీవుడ్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ ఇటీవల కాలంలో యాక్టింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. గతేడాది దాదాపు ఆరేడు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన 'జయ జయ జయ జయహే' తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్నారు. కాశీ విశ్వనాథ్, దేవి ప్రసాద్, వెంకటేశ్ మహా, కరుణ కుమార్‌, శ్రీను గవిరెడ్డి, వివేక్ కృష్ణ లాంటి మరికొందరు దర్శకుడు బిగ్ స్క్రీన్ మీద యాక్టర్స్ గా కనిపించారు. ఇటీవల 'కల్కి 2898 AD' మూవీలో ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ లాంటి డైరెక్టర్స్ స్పెషల్ క్యామీయోలు చేసిన సంగతి తెలిసిందే.