నా కథను నేను సిరీస్‌గా చేస్తుంటే ఎంతో ఇబ్బంది పెట్టారు: నటి సోనా
తెలుగులో ఆయుధం, ఆంధ్రావాలా, కథానాయకుడు సినిమాల్లో నటించిన సోనా ఇప్పుడు తన జీవిత కథను ఓ వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు.
By: Tupaki Desk | 9 March 2025 3:00 AM ISTఒకప్పుడు గ్లామరస్, బోల్డ్ క్యారెక్టర్లలోనే ఎక్కువ కనిపించిన సోనా హైడెన్ దాదాపు పాతికేళ్లగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఆయుధం, ఆంధ్రావాలా, కథానాయకుడు సినిమాల్లో నటించిన సోనా ఇప్పుడు తన జీవిత కథను ఓ వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు. ఆ బయోగ్రఫీ పేరు స్మోక్.
ఈ వెబ్ సిరీస్ షార్ట్ బ్లిస్ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది. ఆస్త అబే, జీవా రవి, ముకేష్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రమోషన్స్ లో సోనా పలు విషయాలను తెలిపారు. ఈ సిరీస్ తెరకెక్కించే టైమ్ లో తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పిన ఆమె, ఎంతోమంది దీన్ని వ్యతిరేకించాని, కొందరైతే స్మోక్ సిరీస్ ను ఆపేయాలని బెదిరించగా, మరికొందరు నీ కథతో సిరీస్ ఎలా తీస్తావని అవమానించారని తెలిపారు.
ఈ సిరీస్ తెరకెక్కిస్తున్న టైమ్ లో తాను ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోయానని చెప్పిన ఆమె ఒంటరిగానే తాను స్మోక్ ను పూర్తి చేసినట్టు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్లామర్ నటిగా పేరు తెచ్చుకున్న సోనా అలా కాకుండా తానొక డైరెక్టర్ గా నిరూపించుకోవాలనే ఈ సిరీస్ ను తెరకెక్కించానని తెలిపారు. తన సిరీస్ ను ఎందుకు ఆపాలనుకున్నారో తనకు అర్థం కావడం లేదని, తానేమీ ఎవరిపై ప్రతీకారంతో ఆ సిరీస్ ను తీయలేదని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
ఇకపై తాను గ్లామర్ రోల్స్ చేయనని చెప్పిన సోనా, తాను చేసే పాత్రకు ప్రాధాన్యముంటేనే నటిస్తానని తెలిపారు. ఇక స్మోక వెబ్ సిరీస్ విషయానికొస్తే 2010 నుంచి 2015 వరకు తన జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలోనే ఇది తెరకెక్కిందని, మొత్తం 8 ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల పాటూ ఉంటుందని, స్మోక్‌కు సీక్వెల్ గా సెకండ్ సీజన్ కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.