Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు ఇస్లామ్‌లోకి మారాల‌ని బ‌ల‌వంతం?

గ‌త ఏడాది బాలీవుడ్ లో నటి సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ పెళ్లి చాలా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Tupaki Desk   |   1 March 2025 3:30 AM GMT
పెళ్లికి ముందు ఇస్లామ్‌లోకి మారాల‌ని బ‌ల‌వంతం?
X

గ‌త ఏడాది బాలీవుడ్ లో నటి సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ పెళ్లి చాలా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జూన్‌లో ఈ జంట‌ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. వారి మ‌తాంతర వివాహం ఆశ్చర్యాన్ని కలిగించింది. సోనాక్షిని మతం మార్చుకోవాల‌ని జ‌హీర్ కుటుంబం బ‌ల‌వంతం చేసింద‌న్న చ‌ర్చ కూడా సాగింది.

అయితే ఇందులో నిజం ఎంత‌? అని సోనాక్షిని ప్ర‌శ్నించ‌గా... ప్ర‌ముఖ మీడియాకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తాను కానీ తన భర్త జహీర్ కానీ ఎప్పుడూ ఒక‌రిపై ఒక‌రు మతాన్ని బలవంతంగా రుద్దాల‌ని చూడ‌లేదని వెల్లడించారు. మేం మతాన్ని చూడటం లేదు. మేం వివాహం చేసుకోవాలనుకున్న ఇద్దరు ప్రేమికులం.. మేం సరిగ్గా అదే చేసాము. అతడు తన మతాన్ని నాపై రుద్ద లేదు. నేను అతడిపై నా మతాన్ని రుద్దడం లేదు. మేము ఎప్పుడూ మతం గురించి ఏమీ చర్చించలేదు. మేం కూర్చుని ఇలాంటివి మాట్లాడము. మేం ఒకరి సంస్కృతులను ఒకరు అభినందిస్తాము.. అర్థం చేసుకుంటాము. వారు వారి ఇంట్లో కొన్ని సంప్రదాయాలను అనుసరిస్తారు. నేను నా ఇంట్లో కొన్ని సంప్రదాయాలను అనుసరిస్తాను. నేను వారిని వారి సంస్కృతిని గౌరవిస్తాను. వాళ్ళు నన్ను, నా కుటుంబం మొత్తాన్ని గౌరవిస్తారు.. అలా ఉండాలి! అని సోనాక్షి ఇంటర్వ్యూలో చెప్పారు.

ఏడేళ్ల సుదీర్ఘ‌ డేటింగ్ అనంత‌రం ఈ జంట జూన్ 2024లో సోనాక్షి, జహీర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఉత్తమ మార్గం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్.. ఈ ప‌ద్ధ‌తిలో నేను ఒక హిందూ మహిళగా నా మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అత‌డు ఒక ముస్లిం పురుషుడిగా, ముస్లిం పురుషుడిగానే ఉండగలడు.. అని సోనాక్షి తెలిపారు. ``ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అందమైన వివాహ బంధాన్ని పంచుకుంటారు. మీరు మతం మారబోతున్నారా? అని ఎవ‌రూ మ‌మ్మ‌ల్ని అడ‌గ‌లేదు. ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటున్నాము. అంతే`` అని అన్నారు. సోనాక్షి త‌న కుటుంబంలో కొంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నా చివ‌రికి పెళ్లి స‌మ‌యానికి అన్నీ స‌ర్ధుకున్నాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... సోనాక్షి చివరిసారిగా `కాకుడా` అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో సాకిబ్ సలీమ్, రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి నటించింది.