నాని సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..!
ఆకట్టుకునే కథలను ఎంపిక చేయడంలో నాని ముందు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 16 March 2025 11:15 AM ISTనేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు మాత్రమే కాకుండా నిర్మించిన సినిమాలు సైతం భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం నాని సమర్పణలో వచ్చిన 'కోర్ట్' సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. కోర్ట్ సినిమా విడుదలకు ముందు నాని చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కోర్ట్ సినిమా ఉంది. ఆకట్టుకునే కథలను ఎంపిక చేయడంలో నాని ముందు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త వారిని పట్టుకుని మరీ దర్శకులుగా మలుస్తున్న నానిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది పారడైజ్' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బోల్డ్ టీజర్ మొత్తం పరిస్థితిని మార్చేసింది. అంచనాలను ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా నానితో శ్రీకాంత్ ఓదెల చెప్పిన ఒక డైలాగ్ సినిమా గురించి జనాల్లో చర్చకు తెర లేపింది. ది పారడైజ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. తాజాగా ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ది పారడైజ్ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించబోతుందా లేదంటే ముఖ్య పాత్రలో కనిపించబోతుందా అనేది చూడాలి. సోనాక్షి సిన్హాను ఈ సినిమాలో నెగటివ్ రోల్‌లో చూపిస్తే సినిమా స్థాయి మరింత పెరగడంతో పాటు నార్త్ ఇండియాలోనూ మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని ఈ సినిమాలో మునుపు ఎన్నడూ లేని విధంగా వైల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా ఆయన చెప్పే డైలాగ్స్, ఆయన చేసే యాక్షన్ కచ్చితంగా షాకింగ్‌గా ఉండబోతున్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
దసరా సినిమా ఫస్ట్ లుక్‌లో నానిని చూసిన సమయంలో చాలా మంది షాక్ అయ్యారు. బాబోయ్ ఇలాంటి లుక్‌తో నానిని చూడగలమా అని కామెంట్ చేశారు. కానీ నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో దసరా చేరిన విషయం తెల్సిందే. నానితో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ది పారడైజ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని, ఈసారి అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో సోనాక్షి సిన్హా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ది పారడైజ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న జటాధర సినిమాలోనూ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే జటాధర సినిమాలోని సోనాక్షి సిన్హా లుక్ రివీల్ అయింది.