మా నాన్న పెంపకాన్ని అంటావా? నటుడిపై స్టార్ హీరోయిన్ ఫైర్!
ఇప్పుడు సీనియర్ నటుడు, శక్తిమాన్ ఫేం ముఖేష్ ఖన్నా సోనాక్షి తండ్రిపై చేసిన ఓ కామెంట్ వివాదాస్పదమైంది.
By: Tupaki Desk | 17 Dec 2024 9:30 AM GMTప్రముఖ బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా ఇటీవల తన పెళ్లి కారణంగా నిరంతరం వార్తల్లో నిలిచింది. కుటుంబాన్ని ఎదురించి ఈ పెళ్లి చేసుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే చివరిగా తన తండ్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా ఆశీస్సులు తనకు లభించాయి. తన కుటుంబం పెళ్లికి వచ్చి జహీర్ ఇక్భాల్ తో సోనాక్షి పెళ్లిని ధీవించారు.
ఇప్పుడు సీనియర్ నటుడు, శక్తిమాన్ ఫేం ముఖేష్ ఖన్నా సోనాక్షి తండ్రిపై చేసిన ఓ కామెంట్ వివాదాస్పదమైంది. సోనాక్షికి సంబంధించిన పాత విషయం ఒకటి మళ్లీ గుర్తు చేసిన అతడు శత్రుఘ్న సిన్హాను తీవ్రంగా విమర్శించాడు. దీనిపై స్పందించిన సోనాక్షి సదరు నటుడిని చాలా వినయంగా హెచ్చరించింది.
రామాయణంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడానికి తన తండ్రి శత్రుఘ్న సిన్హా కారణమని ముఖేష్ ఖన్నా సోనాక్షిని విమర్శించారు. 2019లో సోనాక్షి కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) సీజన్ 11లో పాల్గొంది. రామాయణంలో హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడని హోస్ట్ అడిగారు. కానీ సోనా సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. ఇటీవల సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాక్షికి రామాయణం గురించి బోధించనందుకు శత్రుఘ్న సిన్హాను ముఖేష్ తప్పుపట్టారు.
ఇది సోనాక్షికి నచ్చలేదు. తన తండ్రి గురించి మాట్లాడవద్దని సోనాక్షి ముఖేష్‌ను సూటిగా హెచ్చరించింది. నాకు నా కుటుంబానికి నష్టం కలిగిస్తూ పదే పదే అదే సంఘటనను తెరపైకి తేవడాన్ని సోనాక్షి తప్పు పట్టింది. దీనిని ఆపాలని కూడా ముఖేష్ ఖన్నాను కోరింది. రామాయణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను సరే.. నాతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా జవాబు చెప్పలేకపోయారు. వారిని వదిలేసి నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోగలనని సోనాక్షి సీరియస్ అయ్యారు. చాలా స్పష్టమైన కారణాల వల్ల నా పేరు మాత్రమే ఉపయోగించారు.. అని సోనాక్షి ధుమధుమలాడారు. కేబీసీ షోలో తాను ఆ సమయంలో బ్లాంక్ అవుట్ (ఏమీ తోచలేదు) అయ్యానని కూడా సోనాక్షి అన్నారు.
రాముడు బోధించిన క్షమా గుణం గురించిన పాఠాలను కూడా మర్చిపోయారు మీరు. రాముడు మంథరుడిని క్షమించగలిగితే.. అతడు కైకేయిని క్షమించగలిగితే, అతడు రావణుడిని కూడా క్షమించగలిగితే, ఈ అతి చిన్న(నా విషయంలో) విషయాన్ని వదిలేయండి.. మీ క్షమాపణ నాకు అవసరం అని కాదు... కానీ నా కుటుంబాన్ని నిందిస్తూ మళ్లీ మళ్లీ వార్తల్లోకి రావడాన్ని మీరు ఆపాలి. వెంటనే దీనిని మరచిపోవాలి! అని ముఖేష్ ని ఉద్ధేశించి సోనాక్షి హెచ్చరించారు.
సోనాక్షి తన తండ్రి తనకు కల్పించిన విలువల గురించి మాట్లాడవద్దని ముఖేష్‌ను హెచ్చరించారు.నా పెంపకం గురించిన ప్రకటనలు ఆపండి.. దీనిని అసహ్యంగా మార్చాలనుకుంటున్నారా? అని సోనాక్షి అతడిని ప్రశ్నించారు. సీనియర్ నటుడితో సోనాక్షి గొడవ ఇప్పుడు నెటిజనుల్లో చర్చగా మారింది. సోనాక్షి సిన్హా ఇంతకుముందు రజనీకాంత్ నటించిన లింగా సినిమాతో తమిళం, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు. బాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ నాయికగా నటనలో కొనసాగుతున్నారు. ఇటీవల భన్సాలీ హీరామండిలో సోనాక్షి నటనకు మంచి గుర్తింపు దక్కింది.