స్టార్ డాటర్ రాజకీయాల్లోకి వస్తోందా?
ఇదే ఊపులో శత్రుఘ్నసిన్హా వారసురాలు సోనాక్షి సిన్హా రాజకీయారంగేట్రం చేస్తుందంటూ ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 4 May 2024 4:30 AM GMTనటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం రెగ్యులర్‌గా చూస్తున్నదే. ఈ ఏడాది సినీతారలు చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పలువురు తారలు రాజకీయ పార్టీల ప్రచారఫర్వంలో బిజీగా ఉన్నారు. క్వీన్ కంగన రనౌత్ హిమచల్ ప్రదేశ్ మండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. అలాగే బీహార్ లో నేహాశర్మ తన తండ్రి తరపున కాంగ్రెస్ కి ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే ఊపులో శత్రుఘ్నసిన్హా వారసురాలు సోనాక్షి సిన్హా రాజకీయారంగేట్రం చేస్తుందంటూ ప్రచారం సాగుతోంది.
సోనాక్షి సిన్హా ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ `హీరామండి` విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ లో తన నటప్రదర్శనకు దక్కిన ప్రశంసలను ఆస్వాధిస్తోంది. తన కెరీర్‌లో శక్తివంతమైన నటప్రదర్శనతో రక్తి కట్టించింది సోనాక్షి. దహద్ తర్వాత సోనాక్షి సిన్హా ఫరీదాన్ పాత్రతో హృదయాలను గెలుచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉందా? అని అడిగారు. దానికి సోనాక్షి ఆశ్చుర్యకరమైన సమాధానం ఇచ్చారు.
హోస్ట్ రాజ్ షమానీ నేరుగా సోనాక్షిని ప్రశ్నిస్తూ.. రాజకీయాల్లో చేరబోతున్నారా అని అడిగారు. నిజానికి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా .. తల్లి పూనమ్ సిన్హా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె సోదరుడు లవ్ సిన్హా కూడా రాజకీయాల్లో ఉన్నారు. అతడు 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో INC బంకిపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు. అందుకే సోనాక్షి కూడా రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగారు. దానికి స్పందిస్తూ సోనాక్షి ఛమత్కారమైన జవాబిచ్చారు. ``లేదు, ఫిర్ వాహన్ భీ తుమ్ బంధుప్రీతి నెపోటిజం కరోగే`` అని సమాధానం ఇచ్చింది. రాజకీయాల్లో బంధుప్రీతి నెపోటిజనం సరికాదనేది సోనాక్షి ఉద్ధేశం.
జోక్స్ పక్కన పెట్టి మాట్లాడాల్సి వస్తే.. రాజకీయాల్లో తన తండ్రి పనిని చూసి తాను అలాంటి వ్యక్తిని కాను అని అనుకున్నట్టు తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చే అర్హత తనకు లేదని సోనాక్షి అభిప్రాయపడింది. తన తండ్రి ప్రజల మనిషి అని, తాను ప్రైవేట్ మనిషిని అని చెప్పింది. నాయకుడు లేదా నాయకురాలు ప్రజల మనిషిగా ఉండాలి.. దేశంలోని ఏ మూలకు చెందిన వారికైనా అండగా ఉండాలని సోనాక్షి చెప్పింది. తన తండ్రికి ఆ లక్షణం ఉందని, తనలో అది లోపించిందని తెలిపింది. తాను రాజకీయాల్లో ప్రొఫైల్‌కు అవసరమైన దానికి విరుద్ధంగా ఉన్నానని వెల్లడించింది. సోనాక్షి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నాయకులు తమ సమస్యలుగా స్వీకరించాలని, తాను అలా చేయలేనని చెప్పారు. కాబట్టి నావల్ల ఏ ప్రయోజనం లేదు.. అందుకే రాజకీయాల్లోకి ప్రవేశించను అని ఆమె ముగించింది.
సోనాక్షి సిన్హా ఇటీవల సంజయ్ లీలా భన్సాలీతో `హీరామండి` వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్నప్పటి అనుభవాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో తనపై వన్ టేక్ సాంగ్ బాగా వర్కవుటైందని వెల్లడించింది. భన్సాలీ చివరి నిమిషంలో పూర్తిగా మనసు మార్చుకుని, తనపై పాటను వన్ టేక్ సాంగ్ గా మార్చేశాడని సోనాక్షి తెలిపింది. సోనాక్షి ఈ పాటకు ప్రదర్శన చేయడానికి మొదట్లో భయపడ్డారు కానీ కెమెరా రోలింగ్ అయ్యాక తనలోని సందేహాలు, కుదుపులన్నీ మాయమయ్యాయని వెల్లడించింది.