కన్నడ సినిమాలో చెడ్డ అనుభవం.. మహేష్ హీరోయిన్ ఓపెన్ స్టేట్‌మెంట్!
తాను తెలుగు, కన్నడ పరిశ్రమల్లో నటించానని చెప్పిన సోనాలి బింద్రే.. కన్నడ ఇండస్ట్రీలో అనుభవం అంత మంచిది కాదని వ్యాఖ్యానించడం చర్చకు తెరలేపింది.
By: Tupaki Desk | 8 March 2025 7:39 PM ISTఇది అనాలోచితంగా చేసిన ప్రకటనా? లేక నోరు జారడమో! ఏమో.. తెలీదు కానీ... కన్నడ ఇండస్ట్రీలో ఒక చెడ్డ అనుభవం తనకు ఎదురైందని చెప్పింది పాపులర్ హీరోయిన్ సోనాలి బింద్రే. తాను తెలుగు, కన్నడ పరిశ్రమల్లో నటించానని చెప్పిన సోనాలి బింద్రే.. కన్నడ ఇండస్ట్రీలో అనుభవం అంత మంచిది కాదని వ్యాఖ్యానించడం చర్చకు తెరలేపింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2025ను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా బెంగళూరులో నిర్వహించిన 'అమెజాన్ ఎలివేట్ హెర్ 2025' కార్యక్రమంలో ప్రసంగిస్తూ సోనాలి బింద్రే ఈ కామెంట్ చేశారు. పలు ఇండస్ట్రీల్లో తన అనుభవాల గురించి మాట్లాడారు సోనాలి. ''నేను తెలుగులో సినిమాలు చేశాను.. కన్నడలో ఒక సినిమా చేశాను. ఆ తర్వాత నేను ఇంకెప్పుడూ కన్నడలో చేయాలనుకోలేదు!.. దానికి క్షమించండి, కానీ ఆ సమయంలో అది నాకు మంచి అనుభవం కాదు!'' అని తెలిపింది.
అయితే కన్నడలో నటించేప్పటికి తనకు ఎలాంటి నటనా అనుభవం లేదు. కనీసం స్టేజీ డ్రామాలో కూడా నటించలేదు. తను డ్రామా ఆర్టిస్టును కాదని, నేరుగా సినీరంగంలో ప్రవేశించాక, ఇక్కడే నేర్చుకుంటూ ఎదిగానని నిజాయితీగా అంగీకరించారు సోనాలి బింద్రే. సినీరంగంలో ప్రవేశించేప్పటికి ఏదీ నేర్చుకోకుండా 'రా'గా ఉన్నానని సోనాలి అన్నారు. అయితే కన్నడలో ఒకే సినిమాలో నటించిన సోనాలి బింద్రే, ఈ ఇండస్ట్రీలో మళ్లీ నటించాలనుకోలేదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సోనాలి సంచలన వ్యాఖ్య.. శాండల్వుడ్ కి బ్యాడ్ రిమార్క్. పైగా హిందీ బ్లాక్ బస్టర్ డర్ రీమేక్ ప్రీత్సేలో సూపర్ స్టార్ లు ఉపేంద్ర, శివరాజ్ కుమార్‌లతో కలిసి పని చేసింది. ''కానీ ఆ సినిమా చెడ్డ అనుభవం'' అని సోనాలి వ్యాఖ్యానించింది. ప్రీత్సే 2000 లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే సోనాలి ఏ ఉద్ధేశంలో కన్నడ ఇండస్ట్రీపై వ్యాఖ్యానించారు? అన్నది ఇంకా అస్పష్ఠంగా ఉంది. సినిమాల్లో ప్రవేశించే ముందు తన తండ్రి తనకు మూడేళ్ల పాటు గ్లామర్ రంగంలో కొనసాగే అవకాశం ఇచ్చారని, కానీ తాను నటన ప్రారంభించాక వెనుదిరిగి చూసుకోలేదని సోనాలి వెల్లడించారు. ఆ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని మార్చేసిందని తెలిపారు. సోనాలి బింద్రే గతంలో మహేష్ సరసన మురారి, చిరంజీవి సరసన 'ఇంద్ర' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.