ఇది సోనూ సూద్ స్థాయి.. థాయ్‌లాండ్ అరుదైన గౌరవం
ఇటీవల థాయిలాండ్ దేశం సోనూ సూద్ కి ఉన్న స్థాయిని దృష్టిలో పెట్టుకుని తమ దేశ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లుగా ప్రకటించింది.
By: Tupaki Desk | 10 Nov 2024 11:14 AM GMTఒకప్పుడు సోనూ సూద్ అనగానే ఆయన పోషించిన సినిమాల పాత్రలు గుర్తుకు వచ్చేవి. తెలుగు సినిమా ప్రేక్షకులకు అరుంధతి సినిమా గుర్తుకు వచ్చేది. కానీ కరోనా తర్వాత సోనూ సూద్ అంటే మంచితనం, సహాయం, గొప్ప వ్యక్తిత్వం అనే పదాలు గుర్తుకు వస్తున్నాయి. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూ సూద్ రియల్ హీరోగా పేరు దక్కించుకున్నారు. మొదటి దఫా కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కోసం సోనూ సూద్ చూపించిన దాతృత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక రెండో దఫా కరోనా సమయంలో ఎంతో మందికి రక్తం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడటం జరిగింది.
మంచి మనసుతో సోనూ సూద్ చేసిన సహాయం కారణంగా ఎంతో మంది ప్రాణాలు దక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా అనేక మంది సోనూ సూద్ నుంచి సహాయం పొందిన వారు ఉన్నారు. దేశంలో సోనూ సూద్ ని ఎంతో మంది రియల్ హీరో అంటూ అభిమానించడం మనం చూస్తూ ఉంటాం. అయితే సోనూ సూద్ కి విదేశాల్లోనూ మంచి గుర్తింపు, గౌరవం ఉందని తాజాగా నిరూపితం అయ్యింది. ఇటీవల థాయిలాండ్ దేశం సోనూ సూద్ కి ఉన్న స్థాయిని దృష్టిలో పెట్టుకుని తమ దేశ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లుగా ప్రకటించింది.
రియల్ హీరో సోనూ సూద్ ని ఇటీవల థాయిలాండ్ టూరిజం మరియు స్పోర్ట్స్ మంత్రిత్వశాఖ అధికారులు కలవడం జరిగింది. ఆ సమయంలోనే థాయిలాండ్ యొక్క టూరిజం ప్రమోటర్‌గా గుర్తిస్తూ సర్టిఫికెట్‌ను జారి చేయడం జరిగింది. స్థానిక ప్రజలు ఆయనపై చూపించే అభిమానం, ఆయన జనాల పట్ల చూపించే సేవా గుణం కారణంగా ఈ కీలకమైన బాధ్యతలకు ఆయన్ను తీసుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఇండియన్ పర్యటకులను ఆకర్షించేందుకు గాను సోనూ సూద్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
విలన్‌గా పదుల కొద్ది సినిమాల్లో నటించిన సోనూ సూద్ కి రియల్ హీరో బ్రాండ్ ఇమేజ్ దక్కిన నేపథ్యంలో ఆ మధ్య హీరోగానూ సినిమాల్లో నటించడం జరిగింది. సినిమాల్లో హీరోగా సోనూ సూద్ మెప్పించలేక పోయాడు. కానీ రియల్ హీరోగా మాత్రం విదేశీయులను సైతం మెప్పించిన గొప్ప వ్యక్తి. థాయిలాండ్ టూరిజం అభివృద్దికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా కచ్చితంగా ఉపయోగపడుతాడని ఆయన అభిమానులతో పాటు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.