రూ.99లకే సంక్రాంతి సినిమా చూడొచ్చు
హిందీతో పాటు అన్ని సౌత్ భాషల్లోనూ గేమ్ ఛేంజర్ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 8 Jan 2025 10:30 AM GMTప్రతి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కావడం మనం చూస్తున్నాం. ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి అనే నమ్మకంను కలిగించాయి. ట్రైలర్‌లు వచ్చిన తర్వాత సినిమాలపై అంచనాలు మరింతగా పెరిగాయి. మూడు సినిమాల్లో గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. హిందీతో పాటు అన్ని సౌత్ భాషల్లోనూ గేమ్ ఛేంజర్ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో హిందీలో సోనూ సూద్ నటించిన 'ఫతేహ్' సినిమా విడుదల కాబోతుంది.
జనవరి 10న విడుదల కాబోతున్న ఫతేహ్ సినిమాకు మేకర్స్ ఆఫర్ ప్రకటించారు. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమాను కేవలం రూ.99 లకే చూడవచ్చు అని ప్రకటించింది. సోనూ సూద్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దాంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు యానిమల్ రేంజ్‌లో హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి ఫతేహ్ మంచి సినిమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇలాంటి సమయంలో సినిమా టికెట్లను తగ్గించడం ద్వారా భారీ ఎత్తున మొదటి రోజు ఫుట్ ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కరోనా సమయంలో రియల్ హీరోగా పేరు దక్కించుకుని లక్షలాది మందికి సాయం చేసిన సోనూ సూద్ నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని సినిమాలకు మొదటి రోజు టికెట్ల రేట్లు పెంచితే ఈ సినిమాకు తగ్గించారు కనుక ఫతేహ్ సినిమాకు భారీ ఎత్తున మొదటి రోజు సోనూసూద్ ఫ్యాన్స్‌తో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు తెలుగు సినిమాలకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వంను నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం అడుగుతున్నారు. వారి నుంచి పాజిటివ్‌గా స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వందల రూపాయలు టికెట్ల రేట్లు ఉన్న ఈ సమయంలో ఇంకా పెంచడం అనేది సాధారణ ప్రేక్షకులు జేబుకు చిల్లు పెట్టడం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోనూ సూద్ సినిమా ఫతేహ్‌కి టికెట్ల రేట్లు తగ్గించడం అనేది కచ్చితంగా మంచి పరిణామం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో మెజార్టీ వాటాను చారిటీ కోసం వినియోగించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.