సోను సూద్ NGOకి విదేశీ నిధులకు లైన్ క్లియర్
కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు తెర వెనక ఉండి కథంతా నడిపిస్తున్నారని కూడా విశ్లేషించారు.
By: Tupaki Desk | 25 Jan 2025 5:11 PM2020 కోవిడ్ మహమ్మారి సమయంలో దాతృత్వ కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు నటుడు సోనూసూద్. అతడి సేవలు చాలామంది ప్రాణాల్ని నిలబెట్టడంతో అతడిని మెస్సయ్య, దేవ దూత అంటూ కీర్తించారు. సోనుసూద్ సేవలు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు అభాగ్యులకు కూడా అందాయి. ఆ సమయంలో సోనూసూద్ ఎన్జీవో సేవల గురించి తెలుగు రాష్ట్రాల్లోను విస్త్రతంగా చర్చ సాగింది. ఒక సాధారణ నటుడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు తెర వెనక ఉండి కథంతా నడిపిస్తున్నారని కూడా విశ్లేషించారు.
అదంతా అటుంచితే సోను సూద్ కి చెందిన `సూద్ ఛారిటీ ఫౌండేషన్`కు FCRA (విదేశీ సహకార నియంత్రణ చట్టం) లైసెన్స్‌ను మంజూరు చేసింది. ఎఫ్.సి.ఆర్.ఏ మార్గదర్శకాల ప్రకారం ఈ ఎన్జీవో ఆర్థిక, వైద్య, సామాజిక రంగంలో పనిచేస్తోంది.
భారతదేశవ్యాప్తంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి NGO పనిచేస్తుందని సోనుసూద్ ఫౌండేషన్ ఈ సందర్భంగా వెల్లడించింది. అన్ని వర్గాల ప్రజలకు వనరులు, మద్దతును అందించడంపైనే దృష్టి సారిస్తాం. ప్రపంచవ్యాప్తంగా నిర్ధిష్ఠ ప్రజలకు అవగాహన పెంచడానికి, సంరక్షణ అందించడానికి మా మిషన్‌లో చేరడానికి ఇతరులను ప్రేరేపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి వ్యక్తి, వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, అవసరమైన వనరులు, అవకాశాలను పొందే దేశాన్ని మేం ఊహించాము`` అని చారిటీ వెబ్ పేజీ పేర్కొంది. ఎఫ్‌సిఆర్.ఏ లైసెన్స్ పొందిన సంస్థలు ఐదు సంవత్సరాల పాటు విదేశీ నిధులను స్వీకరించవచ్చు.. ఉపయోగించుకోవచ్చు.
FCRA క్లియరెన్స్ పొందిన ఇతర ఎన్జీవోలలో టిబెటన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ యాక్ట్ ట్రస్ట్, ఠాకూర్ శ్రీ బ్యాంకే బీహార్ జీ మహారాజ్ ట్రస్ట్, హిస్ హోలీనెస్ ది దలైలామా ఛారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి.
పన్ను చెల్లించలేదని ఆరోపణ:
సోను సూద్ ధాతృత్వ సేవలను ప్రజలు కీర్తించినా కానీ, అతడు పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను చెల్లించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 2021లో ఆదాయపు పన్ను శాఖ సోను సూద్ కి చెందిన ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు నిర్వహించింది. అతడి సహచరుల నివాసాలు, ఆఫీసుల్ని శోధించింది. అతడి పనితీరును పరిశీలించి ఆదాయాన్ని లెక్కించింది. నకిలీ సంస్థల నుండి రుణాలకు మళ్లించారని, దాదాపు రూ. 20 కోట్ల మేర పన్ను ఎగవేసారని .. FCRA మార్గదర్శకాలను ఉల్లంఘించడం ద్వారా విరాళాలు సేకరించారని ఐటీ శాఖ ఆరోపించింది. అయితే సోను సూద్ అన్ని ఆరోపణలను ఖండించారు.