Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు అగ్ర హీరోల గుట్టు మ‌ట్లు లీక్ చేసాడు

సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ... అంత‌గా త‌న భావాల‌ను వ్య‌క్తీక‌రించ‌ని వ్యక్తి అని, కానీ ఇత‌రుల విష‌యంలో ఎంతో శ్రద్ధగల మ‌నిషి అని అభివర్ణించాడు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 7:30 PM GMT
ఇద్ద‌రు అగ్ర హీరోల గుట్టు మ‌ట్లు లీక్ చేసాడు
X

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ ద‌ర్శ‌కుడిగా మారి రూపొందించిన `ఫ‌తే` ఈ శ‌నివారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే రెండు ట్రైల‌ర్లు విడుద‌ల‌య్యాయి. సోనూ సూద్ త‌న యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్రంలో హింసాత్మ‌క‌మైన‌ ఫైట్స్ తో నింపాడ‌ని ట్రైల‌ర్లు చెబుతున్నాయి. ఫ‌తే చిత్రం ర‌క్త‌పాతం హింస‌లో `యానిమ‌ల్ కా బాప్` అని నిరూపించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ 2 రివీల్ చేసింది.

ప్ర‌స్తుతం త‌న సినిమాని ప్ర‌మోట్ చేస్తున్న సోనూసూద్ తాను గ‌తంలో క‌లిసి ప‌ని చేసిన ఇద్ద‌రు ఖాన్ ల ర‌హ‌స్యాల‌ను లీక్ చేసాడు. స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ త‌న చుట్టూ ఉన్న వారి విష‌యంలో ఎలా ఉంటారో సోనూసూద్ చెప్పిన విష‌యాలు నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. 2010లో సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ `దబాంగ్`లో విలన్‌గా నటించిన సోను సూద్, 2014 లో `హ్యాపీ న్యూ ఇయర్`లో షారుఖ్ ఖాన్ కు నమ్మకమైన స్నేహితుడిగా నటించారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో సోనూ సూద్ ఆ ఇద్దరు సూపర్‌స్టార్‌లతో కలిసి పనిచేసినప్ప‌టి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఇద్ద‌రు ఖాన్ ల‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉండేది.. కానీ షారుఖ్ ఖాన్‌తో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంద‌ని అన్నాడు. లండ‌న్, అమెరికాకు చార్ట‌ర్ ఫ్లైట్ లో వెళ్లామ‌ని, సుదీర్ఘ ప్ర‌యాణంలో స‌ర‌దాగా గ‌డిచిపోయింద‌ని సోనూ సూద్ అన్నారు. ప్రయాణాల సమయంలో SRKతో సన్నిహితంగా ఉండే అవకాశం క‌లిగింద‌ని అన్నాడు.

సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ... అంత‌గా త‌న భావాల‌ను వ్య‌క్తీక‌రించ‌ని వ్యక్తి అని, కానీ ఇత‌రుల విష‌యంలో ఎంతో శ్రద్ధగల మ‌నిషి అని అభివర్ణించాడు. సల్మాన్ ఖాన్ తనను తాను వ్యక్తపరిచే విష‌యంలో మంచివాడు కాదు కానీ ఎవరినైనా ఇష్టపడితే వారిని మ‌నస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. అత‌డి శ్ర‌ద్ధ ఎదుటి వ్య‌క్తికి తెలిసిపోతుంది.. అని సోనూ సూద్ అన్నాడు. అతడు సల్మాన్ స్వభావాన్ని షారుఖ్ వ్యక్తిత్వంతో పోల్చాడు. షారూఖ్ త‌నలోని భావాల‌ను అద్భుతంగా వ్య‌క్తీక‌రిస్తాడు. అతడు ఎదుటివారిలో దేనినైనా ఇష్టపడితే క‌చ్చితంగా చెబుతాడ‌ని తెలిపాడు.

ఇరువురి మ‌ధ్యా వైరుధ్యాలున్నా కానీ, ఖాన్ ల‌ మధ్య ఒక ఉమ్మడి లక్షణాన్ని గుర్తించాన‌ని సోనూ సూద్ తెలిపాడు. వారి మధ్య సాధార‌ణ విష‌యం ఒక‌టి ఉంది. అన్ని విజయాలు ఉన్నా కానీ..వారి చుట్టూ ఉన్న వ్యక్తులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో వారికి తెలుసున‌ని అన్నాడు.