ఔను నా బయోపిక్‌లో హీరో అతడే!
క్రికెటర్‌గానే కాకుండా బీసీసీఐ బాధ్యతలను సైతం చక్కబెట్టిన సౌరబ్ గంగూలీ జీవిత చరిత్రను వెండి తెరపై చూడాలని ఆయన అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 21 Feb 2025 10:45 AM GMTఇండియాలో క్రికెట్‌కి ఆధరణ పెరిగింది కపిల్ దేవ్ కెప్టెన్సీలో అయితే, క్రికెట్‌ను ఒక మతం మాదిరిగా ఆరాధించడం, అభిమానించడం జరిగింది గంగూలీ కెప్టెన్సీ సమయంలో అనడంలో సందేహం లేదు. టీం ఇండియాకు కమర్షియల్ హంగులు అద్దింది గంగూలీ అనే అభిప్రాయం ఉంది. క్రికెటర్‌గానే కాకుండా బీసీసీఐ బాధ్యతలను సైతం చక్కబెట్టిన సౌరబ్ గంగూలీ జీవిత చరిత్రను వెండి తెరపై చూడాలని ఆయన అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గంగూలీ సీనియర్స్‌తో పాటు జూనియర్‌ల జీవిత చరిత్రలతో సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు గంగూలీ సినిమా మాత్రం రాలేదు.
గత ఏడాది నుంచి గంగూలీ సినిమా గురించి ప్రముఖంగా చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో గంగూలీ బయోపిక్ రూపొందబోతుందనే వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా రాజ్ కుమార్ రావు క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. కథ రెడీ అయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను పూర్తి చేయనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో గంగూలీ బయోపిక్ మూవీ రావడం ఖాయం. షూటింగ్ ఆలస్యం అయితే వచ్చే ఏడాదిలో అయినా ఈ సినిమా విడుదల కావడం అనేది పక్కా అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గత మూడు నాలుగు సంవత్సరాలుగా గంగూలీ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. కానీ ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మొదట గంగూలీ పాత్ర కోసం రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోలను పరిశీలించడంతో పాటు లుక్ టెస్ట్ చేశారు. కానీ వారిలో కొందరు గంగూలీ పాత్రకు సెట్ కావడం లేదు, కొందరు డేట్లు కుదరడం లేదు. దాంతో చివరకు రాజ్ కుమార్ రావు ను సినిమా కోసం ఎంపిక చేశారు. చూడ్డానికి గంగూలీ ఫిజిక్ కలిగి ఉండటంతో పాటు హైట్ సైతం మ్యాచ్ కావడంతో ఆయన్ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది.
తాజాగా గంగూలీ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ... ప్రస్తుతం నా బయోపిక్ రూపొందించే పనులు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు రాజ్ కుమార్ రావు ను నా పాత్రను చేయడం కోసం తీసుకున్నారు. షూటింగ్ ప్రారంభం కావడంకు కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అతడి డేట్లు సర్దుబాటుకి సమయం కావాలని అడిగినట్లు తెలిసింది. కనుక సినిమా విడుదల కావడంకు కాస్త సమయం పట్టవచ్చు అని గంగూలీ అన్నారు. 311 వన్డే మ్యాచ్‌లు, 113 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 18 వేలకు పైగా పరుగులు చేశారు. 2008లో క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు. మూడు సంవత్సరాల పాటు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.