బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో గంగూలీ
విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో లవ్ రంజన్ నిర్మించబోతున్న ఈ భారీ స్పోర్ట్స్ బయోపిక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి అయింది.
By: Tupaki Desk | 2 April 2025 12:30 AMటీం ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బయోపిక్ కోసం ఆయన అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్య కాలంలో క్రికెటర్స్ బయోపిక్‌లు ఎక్కువగా వచ్చాయి. సచిన్, ధోనీతో పాటు పలువురు క్రికెటర్స్ జీవిత చరిత్రాలతో సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు వచ్చాయి. ఎంఎస్ ధోనీ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే గంగూలీ బయోపిక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు గంగూలీ బయోపిక్ వర్క్ మొదలైంది. గత నాలుగు ఏళ్లుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈ ఏడాదిలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
గంగూలీ తన బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో లవ్ రంజన్ నిర్మించబోతున్న ఈ భారీ స్పోర్ట్స్ బయోపిక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి అయింది. రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ను 60 నుంచి 75 రోజుల పాటు ప్లాన్ చేస్తున్నారట. మొదటి షెడ్యూల్‌తో కీలక సన్నివేశాలు, టాకీ పార్ట్ పూర్తి కానుంది. అంతే కాకుండా క్రికెట్ ఆటకు సంబంధించిన సన్నివేశాలు సైతం ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరణ చేయబోతున్నారు.
ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది అనే చర్చలు సుదీర్ఘ కాలం పాటు సాగాయి. రణబీర్ కపూర్ మొదలుకుని చాలా మంది యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ చివరకు గంగూలీని మ్యాచ్ చేయగల ఎనర్జీతో పాటు, ఆయన లుక్‌ను మ్యాచ్ చేయగల సత్తా రాజ్ కుమార్ రావుకు మాత్రమే ఉందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. గంగూలీ కథను ఒక డాక్యుమెంటరీ తరహాలో కాకుండా సినిమాటిక్‌గా చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఆయన జీవితంలోని ఆటను మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సినిమాటిక్ సంఘటనలను సైతం ఈ బయోపిక్‌లో చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
2008లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ గంగూలీ ఆటను వదల్లేదు. ఏదో ఒక రూపంలో క్రికెట్ ప్రపంచంలోనే ఉన్నారు. గంగూలీ బయోపిక్ అనగానే కొన్ని ఐకానిక్ సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి. వాటి చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గంగూలీ షర్ట్ విప్పిన సన్నివేశంను రీ క్రియేట్ చేయడం కోసం చాలా పెద్ద సెటప్‌ను ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి గంగూలీ బయోపిక్ విషయంలో దర్శక నిర్మాతలు చాలా ముందస్తు ప్లాన్ తో ఉన్నారు. ఇది అన్ని బయోపిక్స్ మాదిరిగా ఉండదని, చాలా స్పెషల్‌గా ఈ సినిమా ఉంటుందని, ఒక బయోపిక్‌ను చూస్తున్న ఫీల్ రాకుండా అందులోని పాత్రలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల ఉంటుందేమో చూడాలి.