నార్త్ ను కబ్జా చేస్తున్న సౌత్ స్టార్స్!
అందుకే ఇటీవల కాలంలో సౌత్ హీరోలంతా ఉత్తరాది ప్రేక్షకులే టార్గెట్ గా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 1:30 AM GMTసౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తున్నాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు దక్షిణాది చిత్రాలను ప్రాంతీయ సినిమాలుగా చూసేవాళ్ళు.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా చూస్తున్నారు. ఎందుకంటే మన మూవీస్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఊహించని విధంగా వసూళ్లు రాబడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో సౌత్ హీరోలంతా ఉత్తరాది ప్రేక్షకులే టార్గెట్ గా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వెళ్లి గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. చరణ్, ఎస్‌జే సూర్య, కియారా అద్వానీ, అంజలి సహా నిర్మాత దిల్ రాజు ఈ కార్యక్రమంలో సందడి చేసారు. త్వరలోనే ముంబైలో మరో పెద్ద ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రానున్న రోజుల్లో యూఎస్ లోని డల్లాస్ తో పాటుగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
''పుష్ప 2'' సినిమా ప్రమోషన్స్ కూడా నార్త్ లో ప్రారంభం కానున్నాయి. బాలీవుడ్ లో ఈ సినిమా మీదున్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని, గట్టిగానే ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నాలో ఈ నెల 17న బ్లాస్టింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కోల్‌కతా, ముంబై లాంటి నగరాలలో ఈవెంట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'పుష్ప 1' చిత్రం హిందీలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. చిత్ర బృందం ఈసారి నార్త్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతోంది. అలానే కోచి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో ప్రచార కార్యక్రమాలు చేయనున్నారు.
నిజానికి పాన్ ఇండియా సినిమాలకి నార్త్ మార్కెట్ చాలా కీలకంగా ఉంటుంది. మిగతా భాషల్లో వసూళ్లు కాస్త అటు ఇటుగా ఉన్నా, హిందీలో క్లిక్ అయితే చాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ నంబర్స్ నమోదవుతాయి. అందుకే సౌత్ స్టార్స్ అందరూ ఇప్పుడు పాట్నా, లక్నో, ముంబై లాంటి నగరాలను చుట్టి వస్తున్నారు. ఈ విధంగా ఉత్తరాది జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' 'పుష్ప 2: ది రూల్' మాదిరిగానే, ఇటీవల 'కంగువ' చిత్రాన్ని కూడా ముంబయిలో బాగా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కంటెంట్ నచ్చకపోతే ఈ ప్రమోషన్స్ కూడా ఏమీ చేయలేవనే విషయం అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. 'లైగర్' 'డబుల్ ఇస్మార్ట్' 'ఆదిపురుష్' లాంటి కొన్ని చిత్రాలకు నార్త్ లో విపరీతంగా పబ్లిసిటీ చేసారు. కానీ ఇవన్నీ అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. అదే సమయంలో 'కార్తికేయ 2' 'కాంతారా' లాంటి చిత్రాలు ఎలాంటి ప్రచారం లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. సో మంచి కంటెంట్ ఉంటే, ఆ సినిమాని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడానికి ఈ ప్రమోషన్స్ బాగా ఉపయోగపడతాయి. మరి రాబోయే పాన్ ఇండియా సినిమాలలో ఏవేవి నార్త్ సర్క్యూట్స్ లో సత్తా చాటుతాయో చూడాలి.