Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కే మాస్ నేర్పిస్తున్న సౌత్!

ఒక‌ప్పుడు సౌత్ డైరెక్ట‌ర్లు అంటే బాలీవుడ్ కి చిన్న చూపుగా క‌నిపించేది. కానీ ఇప్పుడా సీన్ మారింది. మాతో కూడా ఓ సినిమా చేయండి ప్లీజ్ అనే ప‌రిస్థితి త‌లెత్తింది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 12:30 PM GMT
బాలీవుడ్ కే మాస్ నేర్పిస్తున్న సౌత్!
X

ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు చేయ‌డంలో సౌత్ నుంచి అందులోనూ టాలీవుడ్..కోలీవుడ్ నుంచి ప్రోఫెష‌న‌ల్ డైరెక్ట‌ర్లు ఎంతో మంది. సినిమాల ట్రెండ్ మారినా క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల హ‌వా ఇంకా రీజ‌న‌ల్ మార్కెట్ లో కొన‌సాగుతుంది అంటే కార‌ణం అలాంటి మేక‌ర్స్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే సౌత్ సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మైన నేప‌థ్యంలో బాలీవుడ్ హీరోలు ఇక్క‌డ ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపి స్తున్నారు.

ఒక‌ప్పుడు సౌత్ డైరెక్ట‌ర్లు అంటే బాలీవుడ్ కి చిన్న చూపుగా క‌నిపించేది. కానీ ఇప్పుడా సీన్ మారింది. మాతో కూడా ఓ సినిమా చేయండి ప్లీజ్ అనే ప‌రిస్థితి త‌లెత్తింది. ఇప్ప‌టికే అట్లీ షారుక్ ఖాన్ తో `జవాన్` చేసాడు. సందీప్ రెడ్డి వంగా రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్` చేసాడు. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో స‌క్సెస్ అయ్యాయో తెలిసిందే. రెండు చిత్రాల్లోనూ క‌మ‌ర్శియ‌ల్ యాంగిల్ పీక్స్ లో ఉంటుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల వ‌సూళ్ల రాబ‌ట్ట‌డంలో ఆ అంశాలు కీల‌క పాత్ర పోషించాయి.

అలాగ‌ని క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు బాలీవుడ్ కి చేత‌కాద‌ని కాదు. కానీ సౌత్ మేక‌ర్ల స్థాయిలో మాత్రం నార్త్ మేక‌ర్లు క‌నెక్ట్ చేయ‌లేరు అన్న విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. సౌత్ డైరెక్ట‌ర్ల స‌క్సెస్ తీరు చూస్తుంటే ఇది నిజ‌మే క‌దా అనిపి స్తుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `పుష్ప‌-2` బాలీవుడ్ ని ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో తెలిసిందే. ఇది ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రం. చిత్తూరు ఎర్ర‌చందనం స్టోరీని తీసుకెళ్లి నార్త్ ఆడియ‌న్స్ కి పీక్స్ లో ఎక్కించడంలో సుకుమార్ వంద‌శాతం స‌క్సెస్ అయ్యారు.

అంత‌కు ముందు `సాహో`తో సుజిత్ కూడా హిందీ మార్కెట్ లో మంచి వ‌సూళ్లు సాధించ‌డంలో ఆ క‌మ‌ర్శియ‌ల్ పంథానే వ‌ర్కౌట్ అయింది. ప్ర‌స్తుతం గోపీ చంద్ మ‌లినేని బాలీవుడ్ హీరో స‌న్నిడియోల్ తో `జాట్` అనే సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు చూస్తే సంగ‌తేంటి అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. గోపీచంద్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ ఆడ్ర‌స్ లాంటాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ బాగానే ఆడాయి. అదే కాన్పిడెన్స్ తో స‌న్నిడియోలో ఛాన్స్ ఇచ్చాడు. అలా సౌత్ మాస్ నార్త్ కి ఎక్కిస్తున్నారు.