Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ: హీరోలే దర్శకులు, దర్శకులే హీరోలు!

సౌత్ సినిమాలో హీరోలు, దర్శకులు వేర్వేరుగా లేరు.. హీరోలే దర్శకులు, దర్శకులే హీరోలు.

By:  Tupaki Desk   |   30 July 2024 5:38 AM GMT
స్పెషల్ స్టోరీ: హీరోలే దర్శకులు, దర్శకులే హీరోలు!
X

సౌత్ సినిమాలో హీరోలు, దర్శకులు వేర్వేరుగా లేరు.. హీరోలే దర్శకులు, దర్శకులే హీరోలు. కెమెరా ముందు యాక్ట్ చేసే చాలామంది కథానాయకులు, ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్తున్నారు. అలానే ఇన్నాళ్ళూ కెమెరా వెనక ఉన్న డైరెక్టర్స్.. మేకప్ వేసుకొని బిగ్ స్క్రీన్ మీద తమలోని మరో కోణాన్ని జనాలకు పరిచయం చేస్తున్నారు. ఓవైపు డైరెక్షన్, మరోవైపు యాక్షన్ తో అదరగొడుతున్నారు.

లేటెస్టుగా తమిళ హీరో ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో 'రాయన్' అనే సినిమా తీసి మంచి హిట్టు కొట్టారు. ఏడేళ్ల క్రితం వచ్చిన 'పా పాండి' చిత్రంతోనే అతను దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన డైరెక్షన్ లో 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' అనే న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ రానుంది. అలానే 'కోమలి' మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్.. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ టుడే' సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ' 'డ్రాగన్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్' సినిమాతో దర్శకుడిగా మంచి విజయం సాధించారు. గతేడాది 'దాస్ కా ధమ్కీ' మూవీ తీసిన మాస్ కా దాస్.. త్వరలోనే 'ఫలక్‌నుమా దాస్ 2' 'ధమ్కీ 2' సినిమాలు చేస్తానని చెబుతున్నారు. మరో యువ హీరో అడివి శేష్ 'కర్మ' అనే చిత్రంతో మెగా ఫోన్ చేతపట్టారు. ఆ తర్వాత 'కిస్' చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే రైటర్ గా తనలోని ప్రతిభను చాటుకుంటున్నారు. తమిళ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ.. 'బిచ్చగాడు 2' చిత్రంతో దర్శకుడిగా మారారు.

'అందాల రాక్షసి' ఫేమ్ రాహుల్ రవీంద్రన్ 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 'మన్మథుడు 2' మూవీని డైరెక్ట్ చేసిన రాహూల్.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత 'ది గర్ల్ ఫ్రెండ్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒకటీ రెండు సినిమాల్లో సెకండ్ హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' చిత్రంతో డైరెక్టర్ అవతరమెత్తారు. 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' 'సార్' వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది.

పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం.. ఇప్పుడు యాక్టర్ గా బిజీ అయిపోతున్నారు. గతేడాది తన స్వీయ దర్శకత్వంలో 'కీడా కోలా' మూవీ చేశారు. ప్రస్తుతం 'జయ జయ జయ జయహే' తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో స్క్రీన్ రైటింగ్ లో డిప్లొమా చేసిన యాక్టర్ అవసరాల శ్రీనివాస్.. 'ఊహలు గుసగుసలాడే' 'జ్యో అచ్యుతానంద' చిత్రాలను తెరకెక్కించారు. లాస్ట్ ఇయర్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

'కాంతారా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. గతంలో 'కిరిక్ పార్టీ'తో సహా మరో మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో 'కాంతారా: చాప్టర్ 1' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. కోలీవుడ్ హీరో ఆర్. మాధవన్ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమా కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. 'లూసిఫర్' తో డైరెక్టర్ గా మారాడు. 'బ్రో డాడీ' చిత్రాన్ని రూపొందించిన సలార్ యాక్టర్.. ప్రెజెంట్ 'లూసిఫర్ 2' సినిమాని తీస్తున్నారు.

పవన్ కల్యాణ్ 'జానీ' సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు. ఇది డిజాస్టర్ అయిన తర్వాత మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు. సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హీరోయిన్ సౌందర్య అకాల మరణంతో ఈ పౌరాణిక చిత్రం ఆగిపోయింది. అయితే ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సన్నివేశాలను 'NBK నర్తనశాల' పేరుతో ఏటీటీలో రిలీజ్ చేశారు. తమిళ హీరో శింబు 'వల్లభ' సినిమాతో డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నారు.

విశ్వనటుడు కమల్ హాసన్ 'భామనే సత్యభామనే', 'హే రామ్', 'పోతురాజు', 'విశ్వరూపం' 1 & 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'మాస్' మూవీతో దర్శకుడిగా పరిచయమైన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. ప్రస్తుతం యాక్టర్ కమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రభుదేవా కూడా దర్శకుడిగా కథానాయకుడిగా రాణిస్తున్నారు. యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన 'ఖుషి' దర్శకుడు ఎస్.జె. సూర్య.. ఇప్పుడు బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మారాడు. కన్నడ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రకాష్ రాజ్ లు కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

'నీతో' సినిమాతో హీరోగా పరిచయమైన కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.. 'బొమ్మలాట' సినిమాతో డైరెక్టర్ గా మారాడు. 'అనగనగా ఓ ధీరుడు' 'సైజ్ జీరో' 'జడ్జిమెంటల్ హై క్యా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి 'దుర్గ' 'హోమం' 'సిద్ధం' 'మనీ మనీ మోర్ మనీ' 'ఆల్ ది బెస్ట్' వంటి సినిమాలతో పాటు పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో సన్నీ డియోల్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, ఫర్హాన్ అక్తర్ లాంటి హీరోలు డైరెక్టర్స్ గా మారారు.

గతంలో నందమూరి తారకరామారావు, నటశేఖర కృష్ణ, చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, బాలయ్య, పద్మనాభం, గిరిబాబు, భాను చందర్.. ఇలా చాలామంది నటులు దర్శకులుగా మెగా ఫోన్ పట్టుకుని సినిమాలను తెరకెక్కించారు. దాసరి నారాయణరావు, ఆర్.నారాయణ మూర్తి, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి పలువురు ప్రముఖులు ఓవైపు ప్రధాన పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.