సౌత్ హీరో.. ఆసియాలోనే నంబర్-1?
రజనీ సినిమా మాస్ కి కనెక్టయితే ఏ రేంజులో ఉంటుందో జైలర్ నిరూపించింది.
By: Tupaki Desk | 24 April 2024 9:54 AM GMTసూపర్‌స్టార్ రజనీకాంత్ సౌతిండస్ట్రీలో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయనకంటూ యూనిక్ స్టైల్, మేనరిజమ్స్ ఉన్నాయి. పరిశ్రమకు ఎందరు హీరోలు వచ్చినా 70 ప్లస్ ఏజ్ లోను ఆయన సత్తా చాటుతూనే ఉన్నారు. చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ ఇటీవలే జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి గ్రేట్ కంబ్యాక్ అంటే ఏమిటో చూపించారు. రజనీ సినిమా మాస్ కి కనెక్టయితే ఏ రేంజులో ఉంటుందో జైలర్ నిరూపించింది.
జైలర్ తర్వాత వరుసగా రెండు సినిమాలకు కమిటయ్యారు రజనీ. అంతేకాదు.. జైలర్ కోసం 100 కోట్లు పైగా పారితోషికం అందుకున్న రజనీ తదుపరి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగానే రజనీ తన తదుపరి చిత్రానికి పారితోషికం అమాంతం రెట్టింపు చేసారని కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రానికి (కూలీ అనే టైటిల్ ప్రకటించారు) సన్నాహకాల్లో ఉన్న రజనీకాంత్ ఈ చిత్రం కోసం ఏకంగా 250 కోట్ల నుంచి 260 కోట్ల మధ్య అందుకుంటున్నారని కథనాలొస్తున్నాయి. పారితోషికం దాంతో పాటే లాభాల్లో వాటాలు అందుకుంటున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే దళపతి విజయ్ రికార్డును కూడా రజనీ అధిగమించినట్టు. కోలీవుడ్ లోనే కాదు ఆసియా ఖండంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ గా రజనీ కాంత్ పేరు రికార్డులకెక్కనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరుస విజయాలతో దూకుడు మీదున్న లోకేష్ కనగరాజ్ జతగా చేరడంతో బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఆయనపై నిర్మాతల పెట్టుబడికి రిటర్నుల పరంగా డోఖా లేదు. అందుకే ఇంత పెద్ద మొత్తాన్ని రజనీకి పారితోషికంగా ముట్టజెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.