1000 కోట్ల క్లబ్ రేసులో సౌత్ సినిమాలివే
అయితే కల్కి తరవాత 1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమాలేవి? అంటూ ఇప్పుడు సరికొత్త చర్చ తెరపైకొచ్చింది.
By: Tupaki Desk | 25 July 2024 3:47 AM GMTరాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత షారూఖ్ నటించిన పఠాన్-జవాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరగా, ఆ రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ప్రభాస్ నటించిన 'కల్కి 2989 ఎడి' చిత్రం సౌతిండియా నుంచి గ్యారెంటీగా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్ సహా చాలా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అయితే కల్కి తరవాత 1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమాలేవి? అంటూ ఇప్పుడు సరికొత్త చర్చ తెరపైకొచ్చింది.
కచ్ఛితంగా సౌత్ నుంచి రాబోవు సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్- రాజమౌళి కాంబినేషన్ మూవీ 1000 కోట్ల క్లబ్ రేసులో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని రాజమౌళి ఇప్పటి స్టామినా దృష్ట్యా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో కామెరాన్ బ్లాక్ బస్టర్ సిరీస్ 'ఇండియానా జోన్స్' జానర్ లో యూనివర్శల్ ఆడియెన్ ని మెప్పిస్తుందని కూడా చెబుతున్నారు. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించగా, రెండేళ్లు పైగానే ఈ మూవీ చిత్రీకరణ సాగుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు డార్లింగ్ ప్రభాస్ 'కల్కి 2989 ఏడి' తర్వాత రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. మారుతితో 'రాజా సాబ్' కూడా భారీ కాన్వాసుతో వస్తోందన్న ప్రచారం ఉంది. అయితే ఇంతకాలం చిన్న సినిమాలు తీసిన మారుతి ఇప్పుడు హఠాత్తుగా పెద్ద సినిమా తీస్తుంటే దానిని 500 కోట్ల క్లబ్ సినిమా అని కూడా ప్రచారంలోకి తేలేకపోతున్నారు. ఈ సినిమాకి కేవలం ప్రభాస్ ఛరిష్మా అతి పెద్ద బలం అని నమ్ముతున్నారు. అయితే ప్రభాస్- ప్రశాంత్ నీల్ జోడీ సలార్ 2 మాత్రం భారీ బజ్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. సలార్ చిత్రం దాదాపు 800 కోట్లు వసూలు చేయడంతో అంతకుమించిన భారీ కాన్వాసుతో రానున్న సీక్వెల్ 1000 కోట్ల క్లబ్ సునాయాసంగా అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా కోసం పని చేస్తున్నారు. తదుపరి ప్రభాస్ తో సలార్ 2 కోసం ప్లాన్ చేస్తారని సమాచారం.
ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ నటించే 'కల్కి 2898ఏడి' సీక్వెల్ మాత్రమే గ్యారెంటీగా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంటుంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 కోసం ఇంకా భారీ బడ్జెట్ ని సమీకరించి, భారీ కాన్వాసుతో తెరకెక్కిస్తుందని కథనాలొస్తున్నాయి.
గేమ్ ఛేంజర్- పుష్ప 2 కి ఛాన్స్?
మరోవైపు మెగా కాంపౌండ్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలకు రానున్నాయి. వీటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ 500 కోట్ల క్లబ్ ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. శంకర్ మార్క్ మేకింగ్ వర్కవుటైతే ఈ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ భారతీయుడు 2 నిరాశపరచడంతో దీనిపై అనుమానాలున్నాయి. శంకర్ తదుపరి 'భారతీయుడు 3'తో పాన్ ఇండియాలో జాక్ పాట్ కొట్టాలని భావించినా కానీ దానికి కూడా 'భారతీయుడు 2' పరాజయం గండి కొట్టింది.
పుష్ప హిందీ బెల్ట్ లో సక్సెస్ సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లోని పుష్ప 2 పైనా ఇదే తీరుగా భారీ అంచనాలున్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలు సహా హిందీ బెల్ట్ లో ఉన్న బజ్ ని చూస్తే ఇది కచ్ఛితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమన్న నమ్మకం పెరిగింది. బన్ని-సుకుమార్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. అలాగే ఎన్టీఆర్ - కొరటాల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న దేవర 1 కచ్ఛితంగా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని, తమిళం నుంచి విజయ్ గోట్ కూడా ఇదే కేటగిరీకి చెందుతుందని విశ్లేషిస్తున్నారు.
షారూఖ్, ప్రభాస్ తర్వాత 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం డజను మంది హీరోలకు ఉంది. చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరారు. మహేష్ ఈ క్లబ్ లో చేరాల్సి ఉంది. అలాగే రెండోసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే వీలుందని అంచనా. దళపతి విజయ్ కి కూడా ఛాన్సుంది.