ట్రెండీ టాక్: ఆ ఐదుగురులో ఎవరు ఘనాపాటి?
సౌతిండియాలో టాప్ 5 డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి-శంకర్-ప్రశాంత్ నీల్- సుకుమార్ ఉన్నారు.
By: Tupaki Desk | 10 April 2024 5:30 PM GMTసౌతిండియాలో టాప్ 5 డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి-శంకర్-ప్రశాంత్ నీల్- సుకుమార్ ఉన్నారు. వీళ్లతో పాటు ఇటీవల సందీప్ రెడ్డి వంగా పేరు కూడా అంతే మార్మోగుతోంది. `యానిమల్`తో 900 కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చిన ఘనత తెలుగు వాడైన సందీప్ రెడ్డి వంగాకు సాధ్యమైంది.
అయితే వీళ్లలో ఎవరి స్థానం ఎక్కడ ఉంది? అన్నదానిపై చాలా విశ్లేషణలు సాగుతున్నాయి. సౌతిండియాలోనే కాదు ఇప్పుడు దేశంలోనే నంబర్ -1 డైరెక్టర్ గా ఎస్.ఎస్.రాజమౌళి పేరు మార్మోగుతోంది. దర్శకధీరుడు ఏ సినిమా తీసినా 1000 కోట్లు మినిమం గ్యారెంటీ అన్న చర్చ ఎలానూ ఉంది. ఇప్పుడు మహేష్ బాబుతో భారీ ఫారెస్ట్ అడ్వెంచర్ ని పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడమే ధ్యేయంగా రాజమౌళి పావులు కదుపుతున్నాడు. ఇది అనుకున్నట్టు సక్సెసైతే గనుక 1000 కోట్లు ఒక మూలన చాలవు. వేల కోట్ల వసూళ్లు గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. ఒక హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ప్రణాళికలు వారికి ఉన్నాయి. రాజమౌళి బ్రాండ్ కి మహేష్ ఛరిష్మా యాడైతే అది పెను సంచలనంగా మారుతుందని అంతా భావిస్తున్నారు.
ఇక రాజమౌళి కంటే ముందే ఎస్.శంకర్ కి ఒక బ్రాండ్ ఉంది. దేశవ్యాప్తంగా అతడు తెరకెక్కించిన సినిమాలు విడుదలై సంచలన వసూళ్లను సాధిస్తాయి. శంకర్ తెరకెక్కించిన 2.0 ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కూడా 500కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. తదుపరి అతడు తెరకెక్కిస్తున్న `గేమ్ ఛేంజర్` పాన్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా రిలీజై 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి ప్రీరిలీజ్ బిజినెస్ అసాధారణంగా ఉంది. `భారతీయుడు 2`తోను శంకర్ మరోసారి మ్యాజిక్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అవినీతి భోగోతం పని పట్టే సేనాపతిని తిరిగి బరిలో దించుతున్నాడు శంకర్. కమల్ హాసన్- శంకర్ కలయికలోని ఈ సినిమా సరైన బ్లాక్ బస్టర్ కొడితే, రాజమౌళితో సమాన హోదాను అందుకుంటాడు శంకర్.
మరోవైపు కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో అనూహ్యంగా రేస్ లోకి దూసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. కేజీఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లు వసూలు చేయడంతో ఒక కన్నడ దర్శకుడి స్టామినా ఏంటో ప్రపంచం గుర్తించింది. ఆ తర్వాతా సలార్ 600కోట్లు వసూలు చేయడంతో ప్రశాంత్ నీల్ దేశంలోనే టాప్ క్లాస్ దర్శకుడిగా వెలిగిపోతున్నాడు. తదుపరి సలార్ 2తో 1000 కోట్ల క్లబ్ గ్యారెంటీ అని భావిస్తున్నారు.
ఇప్పుడు `పుష్ప 2`తో అఖండ విజయం సాధించి 1000 కోట్ల క్లబ్ దర్శకుడిగా వెలిగిపోవాలని సుకుమార్ కలలు కంటున్నాడు. అతడు తెరకెక్కించిన పుష్ప 1 ఉత్తరాదినా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు తన దృష్టి మొత్తం పార్ట్ 2పైనే ఉంచాడు. పుష్ప 2 కేవలం ఉత్తరాది బెల్ట్ నుంచి 500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ నిర్ణయించారు. దానికి తగ్గట్టే పార్ట్ 1 కంటే ఎన్నో రెట్లు కాన్వాస్ ని మార్చి, బడ్జెట్లు పెంచి పార్ట్ 2ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 350 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే ఇప్పుడు పుష్ప 2 నెట్ వసూళ్లనే 1000 కోట్లు సాధించాలనే పంతంతో కనిపిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన పుష్ప 2 టీజర్ మొదటి 24 గంటల్లోనే 39 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. అయితే ఇప్పటికే ఉన్న సలార్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన భారతీయ టీజర్‌గా మొదటి 24 గంటల్లో 83 మిలియన్ల వీక్షణలతో సలార్ నంబర్-1 స్థానంలో నిలిచింది. ఇది నిజానికి సుకుమార్ బృందంలో కొంత ఆందోళన కలిగించే విషయమేనని ప్రచారం జరుగుతోంది. కానీ కేజీఎఫ్ ఫ్రాంఛైజీ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా గనుక సలార్ కి ఉన్న క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. అందుకే ఆ రేంజులో 24గంటల్లో రికార్డులు షేక్ చేసింది సలార్. కానీ పుష్ప దర్శకుడు సుకుమార్ ని ప్రశాంత్ నీల్ తో సమానంగా ఉత్తరాదిన ఇంకా చూసేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే సుకుమార్ ఇంకా 1000 కోట్ల క్లబ్ దర్శకుల జాబితాలో చేరలేదు. అతడు పుష్ప 2 తో ఈ క్లబ్‌లో చేరాలనుకుంటున్నాడు. అందుకే పుష్ప 2 టీజర్ సలార్ 1 టీజర్ తో పోలిస్తే రేసులో వెనకబడిందని విశ్లేషిస్తున్నారు.
అయితే 2023-24 సర్వే ప్రకారం పుష్ప 2 దేశంలోనే మెస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో నంబర్ -1 స్థానంలో ఉంది. ఈ సినిమా ట్రైలర్ సంచలనాలు సృష్టించేందుకు ఆస్కారం ఉంది. ప్రశాంత్ నీల్ క్రేజ్ ని పుష్ప దర్శకుడు సుకుమార్ అందుకోవాలంటే 1000 కోట్లు కొల్లగొట్టాల్సిందే. అప్పటివరకూ ఈ ఎడ్జ్ ఇలానే కొనసాగుతుంది. ప్రస్తుతానికి సౌత్ నుంచి టాప్ 5 దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్, సుకుమార్ ఉన్నారు. ఇక రణబీర్ యానిమల్ చిత్రంతో 900 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన సందీప్ వంగా కూడా టాప్ 5లో ఉన్నాడు. వంగా తదుపరి ప్రభాస్ తో స్పిరిట్ ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో అతడు మరో 1000 కోట్ల క్లబ్ సినిమాని అందిస్తాడని అంచనా వేస్తున్నారు. సందీప్ వంగా పేరు ఇప్పుడు టాప్ 5 దర్శకుల జాబితాలో ఉంది.