Begin typing your search above and press return to search.

అగ్ర దర్శకుడు అప్డేట్ అవ్వకపోతే కష్టమేనా?

'భారతీయుడు 2' రిజల్ట్, కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. శంకర్ రైటింగ్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. అవుట్ డేటెడ్ స్టోరీని ఏమాత్రం ఎమోషన్స్ పండించకుండా ఆవిష్కరించడారనే కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   16 July 2024 5:30 PM GMT
అగ్ర దర్శకుడు అప్డేట్ అవ్వకపోతే కష్టమేనా?
X

ఎస్. శంకర్... ఒకప్పుడు సౌత్ సినిమాని ఏలిన డైరెక్టర్. కమర్షియల్ సినిమాల్లోనూ సోషల్ ఎలిమెంట్స్ ను జోడించడం ఆయన ప్రత్యేకత. భారీ తనానికి పెట్టింది పేరు. తాను తెరకెక్కించే ప్రతీ సినిమాలోనూ ఏదొక సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంటారు. అందుకే ప్రతీ స్టార్ హీరో కూడా ఆయనతో ఒక్కసారైనా కలిసి వర్క్ చెయ్యాలని కోరుకుంటారు. ఆయన అడిగితే కథ వినకుండా కాల్షీట్స్ ఇచ్చే హీరోలు ఉన్నారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన చుట్టూ కావాల్సినంత నెగెటివిటీ వచ్చి చేరింది.

1993లో 'జెంటిల్‌ మ్యాన్‌' మూవీతో దర్శకుడిగా పరిచయమైన శంకర్.. తన 30 ఏళ్ల సినీ కెరీర్ లోఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఆయన తెరకెక్కించిన ప్రేమ దేశం, భారతీయుడు, జీన్స్, ఓకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి సినిమాలు తెలుగులోనూ అధ్బుతమైన విజయం సాధించాయి. అయితే అక్కడి నుంచి దర్శకుడు తన స్థాయికి తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. స్నేహితులు, ఐ, 2.0 వంటి చిత్రాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. లేటెస్టుగా వచ్చిన 'భారతీయుడు 2' సినిమా సైతం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత శంకర్ నుంచి వచ్చిన సినిమా 'ఇండియన్ 2'. కమల్ హాసన్ తో 28 ఏళ్ల క్రితం తీసిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ ఇది. ఎట్టకేలకు ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కు మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో 100 కోట్ల వరకూ ఓపెనింగ్స్ రాబట్టగలిగింది కానీ, నెగిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ మండేకి సింగిల్ డిజిట్ గ్రాస్‌ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఇది శంకర్ కెరీర్ లో డిజాస్టర్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'భారతీయుడు 2' రిజల్ట్, కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. శంకర్ రైటింగ్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. అవుట్ డేటెడ్ స్టోరీని ఏమాత్రం ఎమోషన్స్ పండించకుండా ఆవిష్కరించడారనే కామెంట్లు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దర్శకులు అప్డేట్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని.. లేకపోతే ఇలాంటి అవుట్ ఫుట్స్ మాత్రమే వస్తాయని నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే శంకర్ ఫ్యాన్స్ మాత్రం 'గేమ్ ఛేంజర్' చిత్రంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని నమ్ముతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ చేంజర్'. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ చిత్రం.. 'ఇండియన్ 2' & 'ఇండియన్ 3' కారణంగా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఆ మధ్యనే చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేశారు. ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

నిజానికి 'గేమ్ ఛేంజర్' శంకర్ సొంత కథ కాదు. కార్తీక్ సుబ్బరాజు ఈ స్టోరీ లైన్ ఇచ్చారు. దాన్ని శంకర్ తన స్టైల్ లోకి మార్చుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నారు. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ఏదైనా వదిలితే.. దర్శకుడి టేకింగ్ ఎలా ఉంటుందనేది తేలిపోతుంది. కాకపోతే 'ఇండియన్ 2' ఆరేళ్ల క్రితం మొదలైన ప్రాజెక్ట్ కాబట్టి, అవుట్ డేటెడ్ అనిపించి ఉండొచ్చు. కానీ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా ఈ జనరేషన్ కు తగిన విధంగా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. వీళ్ళ నమ్మకం ఏ మేరకు నిజం అవుతుందనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.