Begin typing your search above and press return to search.

'స్పిరిట్‌' కాస్టింగ్ కాల్‌ పూర్తి అయినట్లేనా?

గత నెలలో స్పిరిట్‌ సినిమా యూనిట్‌ సభ్యులు కాస్టింగ్‌ కాల్‌ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 March 2025 2:46 PM IST
Spirit Casting Call
X

ప్రభాస్‌, సందీప్ వంగ కాంబోలో రూపొందబోతున్న 'స్పిరిట్‌' ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. యానిమల్‌ సినిమా విడుదలైన వెంటనే స్పిరిట్‌ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ మొదలు పెడతానంటూ సందీప్ వంగ ప్రకటించాడు. అన్నట్లుగానే స్పిరిట్‌ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సమ్మర్ నుంచి సెట్స్‌ పైకి వెళ్లాలని భావించాడు. కానీ షూటింగ్‌ ఆలస్యం అయ్యేలా ఉంది. ఆమధ్య ప్రభాస్‌కి గాయం కావడం వల్ల రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఆ రెండు సినిమాల ఆలస్యం కారణంగా స్పిరిట్ సినిమా మొదలు కావడంకు మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అని సినీ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సందీప్‌ వంగ ప్రస్తుతం నటీనటుల ఎంపిక విషయమై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

గత నెలలో స్పిరిట్‌ సినిమా యూనిట్‌ సభ్యులు కాస్టింగ్‌ కాల్‌ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ప్రభాస్‌కి జోడీగా నటించబోతున్న హీరోయిన్‌ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇక ఆడిషన్స్‌కి కొత్త వారు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్న పలువురు సైతం ప్రభాస్ సినిమాలనే ఆసక్తితో హాజరు అయ్యారని తెలుస్తోంది. స్పిరిట్‌ సినిమాలో నటించాలనే ఆసక్తితో ఉన్నట్లు హీరో మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే. మరి స్పిరిట్‌ సినిమాలో మంచు విష్ణును సందీప్ వంగ ఎంపిక చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మంచు విష్ణు విషయం పక్కన పెడితే స్పిరిట్‌ సినిమాలో కీలక పాత్రలో నటించడం కోసం నటుడు సుహాస్‌ ఆడిషన్స్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. కీలక పాత్ర కోసం సుహాస్ ఎంపిక దాదాపుగా కన్ఫర్మ్‌ అంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి.

స్పిరిట్‌ సినిమాలో సుహాస్‌ నటించబోతున్నాడని, ఆడిషన్స్‌కి సైతం హాజరు అయ్యాడంటూ వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. స్వయంగా సుహాస్ ఈ విషయమై స్పందించాడు. స్పిరిట్‌ సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కానీ స్పిరిట్‌ సినిమాలో నటించడం కోసం ఆడిషన్స్‌కి హాజరు అయినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చాడు. స్పిరిట్‌ సినిమాలో తాను నటించడం లేదని, ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను అని, స్పిరిట్‌ సినిమాకు సంబంధించి ఎటువంటి చర్చలు కూడా జరగలేదని సుహాస్‌ అన్నాడు. స్పిరిట్‌ సినిమాలో సుహాస్ నటించడం లేదని స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు ప్రభాస్ కాకుండా ఇంకా ఎవరు నటిస్తారు అనే విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాస్టింగ్‌ కాల్‌కి మంచి స్పందన వచ్చిందని సమాచారం. నటీనటులను ఎంపిక చేశారా.. కాస్టింగ్‌ కాల్ పూర్తి అయినట్లేనా అనేది మేకర్స్ నుంచి స్పందన రావాల్సి ఉంది.

సోషల్‌ మీడియాలో మాత్రం హీరోయిన్స్‌ గురించి, విలన్ గురించి, కమెడియన్స్ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇకపై అయినా ఆ పుకార్లకు చెక్‌ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం రాజాసాబ్‌ సినిమాను ముగించే పనిలో ఉన్న ప్రభాస్ మరో వైపు ఫౌజీ సినిమాను పూర్తి చేసేందుకు క్రమం తప్పకుండా డేట్లు ఇస్తూ వస్తున్నాడు. కనుక స్పిరిట్‌ సినిమా ప్రారంభం కావాలంటే కనీసం రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. సందీప్ వంగ చాలా స్పీడ్‌గా సినిమాలను రూపొందిస్తూ ఉంటాడు. కనుక స్పిరిట్‌ మొదలైతే వచ్చే ఏడాది వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా స్పీడ్‌గా చిత్రీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడనే విషయం తెల్సిందే.