ప్రభాస్ 'స్పిరిట్' లెక్క ఎంతో తెలుసా...!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 18 Sep 2024 3:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. గత ఏడాదిలోనే సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇప్పటి వరకు కనీసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వలేదు. ప్రస్తుతం డైలాగ్ వర్షన్ స్క్రిప్ట్ రాస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరి లేదా సమ్మర్ లో స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు సందీప్ వంగ గత చిత్రం యానిమల్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో స్పిరిట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
విజయ్ దేవరకొండతో సందీప్ వంగ రూపొందించిన అర్జున్ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో 'యానిమల్' సినిమాను తెరకెక్కించిన సందీప్ వంగ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెల్సిందే. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన యానిమల్ సినిమా తర్వాత సందీప్ వంగ తీయబోతున్న సినిమా పై సాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ సినిమాలో ప్రభాస్ నటించబోతున్న నేపథ్యంలో అంచనాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం మామూలు విషయం కాదు.
కెరీర్ ఆరంభం నుంచే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న దర్శకుడు సందీప్ వంగ త్వరలో చేయబోతున్న ప్రభాస్ స్పిరిట్ కి ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ ను అనుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. అందులో రూ.200 కోట్లు పారితోషికాలు పోనుండగా, మేకింగ్ కోసం అటు ఇటుగా రూ.300 కోట్లు ఖర్చు చేయబోతున్నాడట. ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్ సినిమాలు కామన్ అయ్యాయి. అయితే రూ.500 కోట్ల సినిమా అంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా నూ దర్శకుడు నాగ్ అశ్విన్ దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన విషయం తెల్సిందే.
సందీప్ వంగ తన సన్నిహితులతో కలిసి టి - సిరీస్ బ్యానర్ భాగస్వామ్యంతో 'స్పిరిట్' సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ స్థాయి బడ్జెట్ అంటే కచ్చితంగా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అవ్వాల్సి ఉంది. దర్శకుడు సందీప్ వంగ తన గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో స్పిరిట్ కి సాధారణంగానే పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. ముందు ముందు భారీ అప్‌డేట్స్ సినిమా గురించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక స్పిరిట్ సినిమాకు రూ.500 కోట్లు పెట్టినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం సినిమా కోసం ప్రభాస్ రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.