వెబ్ సిరీస్ రివ్యూ : 'స్క్విడ్ గేమ్-2'
కొరియన్ సినిమాలంటే పడిచచ్చే సినిమా ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఆ భాష నుంచి వచ్చిన ‘పారసైట్’ ఎలా ఉర్రూతలూగించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 27 Dec 2024 7:38 AM GMT'స్క్విడ్ గేమ్-2' వెబ్ సిరీస్ రివ్యూ
నటీనటులు: లీ జంగ్ జే-వి హా జున్-లీ బ్యుంగ్ హున్ తదితరులు
దర్శకత్వం: హ్వాంగ్ డాంగ్ హ్యుక్
ప్రసారం: నెట్ ఫ్లిక్స్
ఎపిసోడ్లు: 7
కొరియన్ సినిమాలంటే పడిచచ్చే సినిమా ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఆ భాష నుంచి వచ్చిన 'పారసైట్' ఎలా ఉర్రూతలూగించిందో తెలిసిందే. అదే భాష నుంచి మూడేళ్ల కిందట రిలీజైన 'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉత్కంఠతో ఊపేసిన ఆ సిరీస్ కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమ్ అవుతున్న 'స్క్విడ్ గేమ్-2' విశేషాలేంటి.. పార్ట్-1 లాగే ఇదీ మెప్పించిందా.. చూద్దాం పదండి.
కథ:
పెద్ద పెద్ద తప్పులు చేసి భారీగా అప్పుల పాలై.. జీవితం మీద ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్న వ్యక్తులను ఎంచుకుని వారిని ఒక దీవికి తీసుకెళ్లి పిల్లల ఆటల పేరుతో ప్రమాదకరమైన గేమ్స్ ఆడిస్తూ.. ఆ ఆటల్లో ఓడిన వారి ప్రాణాలు తీసి వినోదం చూస్తుంటారు కొందరు బిగ్ షాట్స్. ఇవి మామూలు ఆటలే అనుకుని ఆడడం మొదులపెట్టిన 600 మంది సమూహంలో అందరూ చనిపోయి చివరికి సియాంగ్ జి హున్ (లీ జంగ్ జే) మాత్రమే మిగులుతాడు. గేమ్ రూల్స్ ప్రకారమే అతడికి 40 బిలియన్ వాన్లకు పైగా (సుమారు రూ.230 కోట్లు) డబ్బు ప్రైజ్ మనీగా అందుతుంది. కానీ ఆ డబ్బుతో అతను సంతృప్తి చెందడు. బయటికి వచ్చాక ఈ డేంజర్ గేమ్ ను ఆపి తీరాలి అని పంతం పడతాడు. ఇందుకోసం అతనేం చేశాడు.. మరోసారి గేమ్ ఆడించిన నిర్వాహకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. ఈ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
విశ్లేషణ:
ఓ కొత్త కథతో తెరకెక్కిన సినిమా లేదా సిరీస్ పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ప్రేక్షకులను ఉర్రూతలూగించి సెన్సేషనల్ హిట్ అయ్యాక.. దాని సీక్వెల్ వస్తోందంటే ఉండే అంచనాలే వేరు. ఐతే ఆ అంచనాలను అందుకోవడం అంత తేలిక కూడా కాదు. తొలి భాగం చూసేటపుడు అంతా కొత్తే. కథ నుంచి ప్రతిదీ క్యూరియస్ గా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి.. తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో చూస్తాం. ప్రేక్షకుడి అంచనాలకు అందని విధంగా ఆ కథ నడిచినపుడు.. ప్రతిదీ సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఇలాంటి కథకు కొనసాగింపుగా ఇంకో సినిమా లేదా సిరీస్ వస్తే.. అంతకుమించిన ఉత్కంఠను.. వినోదాన్ని ఆశిస్తాం. అదే సమయంలో కథ పరంగా కొత్తగా ఏదైనా చూడాలనుకుంటాం. అప్పటికే కాన్సెప్ట్ తెలిసి ఉండడం వల్ల కథ పరంగా ఎగ్జైట్మెంట్ తీసుకురావడం అంత తేలిక కాదు. 'స్క్విడ్ గేమ్-2' ఈ విషయంలో ఒకింత నిరాశకే గురి చేస్తుంది. ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్.. బోర్ కొట్టకుండా సాగిపోతుంది కానీ.. ఫస్ట్ పార్ట్ స్థాయిలో అయితే ఉత్కంఠ లేదు. కథనంలో వేగం కూడా తగ్గింది. ప్రేక్షకులకు షాకిచ్చే అంశాలు కూడా తక్కువే.
స్క్విడ్ గేమ్ ఎవ్వరూ ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్. గేమ్ ఆడదామని దీవిలోకి చేరే పార్టిసిపెంట్లు తమషాగా ఆట మొదలుపెడతారు. కానీ అక్కడ జరిగే పరిణామాలతో ఒక్కసారిగా హతాశకులవుతారు. అక్కడ్నుంచి మొదలయ్యే ఉత్కంఠ చివరి వరకు కొనసాగుతుంది. ఈ గేమ్ పార్టిసిపెంట్ల మాదిరే చూసే ప్రేక్షకులకు కూడా సిరీస్ మొదలుపెట్టినపుడు మామూలుగా అనిపిస్తుంది.కానీ తొలి షాక్ తర్వాత ఉత్కంఠతో ఊగిపోతారు. క్షణ క్షణం టెన్షన్ పెడుతూ.. గగుర్పాటు కలిగిస్తూ సాగుతుంది. ఐతే ఫస్ట్ పార్ట్ లోనే కాన్సెప్ట్ ఏంటో తెలిసిపోవడం వల్ల 'స్క్విడ్ గేమ్-2' పార్టిసిపెంట్లు ఆడే ఆటలు అంత సర్ప్రైజింగ్ గా అనిపించవు.వాళ్లలో ఒక్కొక్కరు చనిపోతున్నా అంత టెన్షన్ కలగదు. హీరో మళ్లీ గేమ్ లోకి అడుగుపెట్టడానికి ముందు.. అక్కడికి చేరుకోవడానికి చేసే ప్రయత్నం నేపథ్యంలో నడిచే రెండు ఎపిసోడ్లు కొంచెం మామూలుగా అనిపిస్తాయి. కథ దీవిలోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది.. అక్కడ మళ్లీ ఆటలు ఎప్పుడు.. ఎలా మొదలవుతాయనే ప్రేక్షకులు ఎదురు చూస్తారు. అంత వరకు కథనం కొంచెం నెమ్మదిగా నడుస్తుంది.
గేమ్స్ మొదలయ్యాక అక్కడి వ్యవహారాలు మరీ కొత్తగా అనిపించకపోయినా.. ఉత్కంఠభరితంగానే నడుస్తాయి. హీరోతో పాటే ఉండే ఒక పాత్ర కథను ఉత్కంఠభరితంగా మార్చడానికి ఉపయోగపడింది. ఆ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఏంటన్నది తెర మీదే చూడాలి. ఫస్ట్ పార్ట్ లో చూసిన మోషన్ క్యాప్చర్ టాయ్ గేమ్ తో పాటు కొత్త ఆటలు కొన్ని చూస్తాం ఇందులో. ఒక్కో ఆట తర్వాత ప్లేయర్లు ఎలిమినేట్ కావడం.. అందుకు తగ్గట్లుగా ప్రైజ్ మనీ పెరగడం.. ఇవన్నీ మామూలుగానే అనిపిస్తాయి. దీనికి తోడు కొత్తగా ఓటింగ్ ప్రక్రియ అంటూ ఒకటి చూస్తాం. కానీ ఆ ఓటింగ్ వ్యవహారం మరీ లెంగ్తీగా అనిపించి కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో మాదిరి ఎక్కువగా టిపికల్ క్యారెక్టర్లు ఇందులో కనిపించవు. ఇందులోని క్యారెక్టర్ల ఉపకథలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఐతే తర్వాత ఏం జరుగుతుందనే కుతూహలం వల్ల.. కొన్ని ఆసక్తికర ఎపిసోడ్ల వల్ల 'స్క్విడ్ గేమ్-2' ముందుకు అయితే సాగిపోతుంటుంది. ఈ కథను ఎలా ముగిస్తారు.. సీజన్-2కు ఎలాంటి ముగింపునిస్తారు అని ఉత్కంఠతో ఎదురు చూస్తాం. హీరోతో ఉండే సర్ప్రైజ్ క్యారెక్టర్ తో చివర్లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారా అనే టెన్షన్ కలుగుతుంది. కానీ పతాక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు. 'స్క్విడ్ గేమ్'లో కథను ఒక చోట ముగించి.. రెండో పార్ట్ కు లీడ్ ఇస్తారు. అందులో ఒక పూర్తి కథను చూసిన ఫీలింగే కలుగుతుంది. కానీ 'స్క్విడ్ గేమ్-2'లో మాత్రం కథను మధ్యలో ఆపేసి అసంతృప్తికి గురి చేశాడు దర్శకుడు. ఇదేం ముగింపు అనుకుంటూ.. ఏదో మిస్ అయిన ఫీలింగ్ తో సీజన్-3 కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే 'స్క్విడ్ గేమ్' స్థాయిలో అయితే 'స్క్విడ్ గేమ్-2' లేదు. ఇందులో సర్ప్రైజులు.. షాకులు తక్కువే. కాకపోతే సిరీస్ బోరింగ్ గా అయితే అనిపించదు. 'స్క్విడ్ గేమ్' కథను కంటిన్యూ చేయాలనుకునేవారు దీనిపై ఓ లుక్కేయొచ్చు.
చివరగా: స్క్విడ్ గేమ్-2.. ఉత్కంఠ తగ్గింది
రేటింగ్- 2.5/5