శ్రీలీల గొప్ప మనసు.. ఎవరికి తెలియని ఓ రహస్యం!
అదే సమయంలో, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఆమె సన్నిహితంగా ఉంటోందనే ప్రచారం ఊపందుకుంది.
By: Tupaki Desk | 14 March 2025 3:33 PM ISTశ్రీలీల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ పరంగా ఆమె అగ్రస్థాయిలో ఎదుగుతున్నా కూడా, వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ తో ఆమె క్లోజ్ గా ఉంటూ కనిపించడం కొత్త రూమర్లకు తెరతీసింది. అయితే, ఆమె సినిమాల కంటే ముందుగా చేసిన ఓ నిర్ణయం నెట్టింట హాట్ డిస్కషన్ గా మారింది.
2022లోనే శ్రీలీల తన జీవితంలో ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. తన వయస్సు కేవలం 23 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, ఇద్దరు వికలాంగ బాలురను దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకు అండగా నిలిచింది. గురు, శోభిత అనే చిన్నారులను ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు మళ్లీ వెలుగు చూసింది, ఆమె వ్యక్తిగత జీవితం మీద ఆసక్తి పెరిగిన వేళ.
అదే సమయంలో, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఆమె సన్నిహితంగా ఉంటోందనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కార్తిక్ ఇంట్లో జరిగిన ఓ ఫ్యామిలీ సెలబ్రేషన్ లో స్రిలీల హాజరైనట్లు వీడియోలు బయటకొచ్చాయి. ఆ పార్టీలో ఆమె మిగతా కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేస్తూ కనిపించడంతో వీరిద్దరి మధ్య రొమాన్స్ పెరిగిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ గాసిప్ మరింత బలపడడానికి మరో కీలక కారణం కూడా ఉంది. IIFA అవార్డ్స్ 2025లో కార్తిక్ తల్లి మాలా తివారీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఈ రూమర్లకు బలం చేకూర్చింది. ఒక ఇంటర్వ్యూలో కార్తిక్ భవిష్యత్తు భార్య గురించి ప్రశ్నించగా, “మా ఇంటికి మంచి డాక్టర్ కావాలి” అని సమాధానమిచ్చింది. దీనిని నెటిజన్లు శ్రీలీలకే సంబంధించిందిగా భావిస్తున్నారు, ఎందుకంటే ఆమె ఇప్పటికే MBBS పూర్తి చేసింది.
ఇదిలా ఉంటే, శ్రీలీల, కార్తిక్ కాంబినేషన్ త్వరలోనే స్క్రీన్ పై కూడా కనువిందు చేయబోతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటించబోతున్నారు. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా "ఆశికి 3" అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు గానీ, ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాల సంగతి పక్కన పెడితే, శ్రీలీల వ్యక్తిగత నిర్ణయాలు ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. అతి చిన్న వయస్సులోనే సమాజ సేవలో భాగమవ్వడం, వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మౌనంగా ఉండడం, ఇప్పుడు బాలీవుడ్ లో ప్రేమ గాసిప్స్ తో ట్రెండ్ అవుతుండటం.. ఇవన్నీ ఆమె పేరు చుట్టూ మిస్టీరియస్ అంశాలుగా క్రియేట్ చేస్తున్నాయి. ఏది నిజమో తెలియదు గానీ, ప్రస్తుతం శ్రీలీల పేరు మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలోనూ హాట్ టాపిక్ గా మారింది!