శ్రీ విష్ణు - 'నో బ్రేక్స్, జస్ట్ లాఫ్స్'
ఇటీవల వరుస విజయాలతో తన మార్కెట్ రేంజ్ ను కూడా పెంచుకున్నాడు.
By: Tupaki Desk | 28 Feb 2025 10:17 AM ISTడిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటులలో శ్రీవిష్ణు టాప్ లిస్టులో ఉంటాడని చెప్పవచ్చు. కమర్షియల్ మసాలా సినిమాల కంటే కొత్త కాన్సెప్ట్‌తో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను ఎంచుకోవడంలో అతనిది సొంత మార్క్. ఇటీవల వరుస విజయాలతో తన మార్కెట్ రేంజ్ ను కూడా పెంచుకున్నాడు.
ముఖ్యంగా సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రకటించాడు. శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రొడక్షన్ నంబర్ 3 పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ హైలైట్ పోస్టర్. అందులో కనిపించిన హోండా CD100 బైక్ అద్భుతమైన మోడిఫికేషన్ తో, రెండు హెడ్ లైట్స్, ఐదు చక్రాలతో స్టైలిష్ గా ఉండడం విశేషం.
ఏ సినిమా కాన్సెప్ట్ అయినా ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేపాలన్న ఉద్దేశ్యంతో మేకర్స్ విభిన్నమైన డిజైన్ తో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్ శ్రీ విష్ణు పాత్రపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మేకర్స్ పోస్టర్‌కి ఒక క్యాచీ ట్యాగ్‌లైన్ కూడా జతచేశారు. గెట్ ఇన్ ఫర్ ఏ క్రేజీ రైడ్, నో బ్రేక్స్, జస్ట్ లాఫ్స్. అంటే, సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది.
శ్రీ విష్ణు ఇప్పటివరకు ఎన్నో కామెడీ బేస్డ్ కాన్సెప్ట్ సినిమాలు చేసినా, ఈసారి మరింత డిఫరెంట్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణుతో పాటు సత్య, గోపరాజు రమణ, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు, సుబ్రహ్మణ్య నాయుడు, రామచారి ఎమ్ కలిసి నిర్మిస్తున్నారు.
శ్రీ విష్ణు సినిమాలపై మంచి అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విభిన్న కాన్సెప్ట్, హాస్య ప్రధానమైన కథతో ప్రేక్షకుల మనసుల్ని గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ చూసిన అభిమానులు ఈ బైక్ రైడ్ వెనుక కథ ఏంటి శ్రీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతుంది కామెడీ ఎలా పండించబోతున్నారు? అన్న ప్రశ్నలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బైక్ లుక్‌తోనే ఇంట్రెస్టింగ్ హైప్ తెచ్చిన మేకర్స్, త్వరలోనే సినిమా టైటిల్ పై మరో అప్‌డేట్ ఇవ్వనున్నారు.