స్వాగ్.. మగజాతి కోసం శ్రీవిష్ణు పునర్జన్మ పోరాటం
స్వాగ్.. అంటూ శ్రీ విష్ణు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Tupaki Desk | 29 Aug 2024 12:40 PM GMTస్వాగ్.. అంటూ శ్రీ విష్ణు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'రాజా రాజ చోర' వంటి హిట్ తర్వాత హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు, ఇది ప్రేక్షకులలో మంచి అంచనాలను పెంచింది.
టీజర్ ప్రకారం, అనేక శతాబ్దాల క్రితం పురుషుల ఉనికి ప్రమాదంలో ఉన్న కాలం, విన్జమారా వంశానికి చెందిన రుక్మిణీ దేవి అనే రాణి పురుషులపై అత్యంత ద్వేషాన్ని పెంచుకొని తనకు పుట్టిన కుమారుడు అయినా చంపుతానని అంత స్థాయిలో పురుషులను ద్వేషించేది. అయితే ఆ వంశంపై ఉన్న శాపం కారణంగా పరిస్థితులు మారి, పురుషులు మహిళలను శాసించే పరిస్థితికి వచ్చింది.
సామ్రాజ్యం నిలవాలంటే మగవారు అవసరం అని తెలిసి, ఆమె ముందు ఒక సవాలు నిలుస్తుంది. ఈ సమయంలో ఓ వీరుడు (శ్రీ విష్ణు) ఈ వ్యవస్థను నిలువరించాలని ప్రయత్నిస్తాడు. కానీ, అతనికి భిన్నమైన మూడు ఇతర పాత్రలు- సింగ, భవభూతి, యయాతి - కూడా ఈ కథలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ కథలో పునర్జన్మల నేపథ్యంలో పురుషాధికారాన్ని ప్రశ్నించే కథనం ఉంచి, పాత్రల పోరాటాలు ఆధునిక సమాజానికి కూడా సంబంధం కల్పించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. టీజర్‌లో శ్రీ విష్ణు నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తాడు, ప్రతి పాత్ర తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీతూ వర్మ రాణిగా సీరియస్ లుక్ లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
సాంకేతికంగా కూడా ఈ టీజర్ హైలైట్‌గా నిలిచింది. వివేక్ సాగర్ అందించిన సంగీతం, శంకరన్ ఛాయాగ్రహణం సినిమాకి బలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో చూపించిన విభిన్నమైన నేపథ్యం, సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మొత్తంగా, ‘స్వాగ్’ టీజర్ ద్వారా ప్రేక్షకుల అంచనాలను పెంచి, సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలను రేపింది. ఈ సారి శ్రీ విష్ణు, హాసిత్ గోలి కాంబినేషన్ కేవలం వినోదమే కాదు, ఒక ప్రత్యేకమైన కథతో వస్తోంది. భారతీయ చిత్రసీమలో ఇప్పటి వరకు చర్చించని అంశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయని టీజర్ ద్వారా తెలుస్తోంది.