3 గంటల నిడివితో వస్తోన్న 'లారి చాప్టర్-1'
"లారీ చాప్టర్-1" చిత్రాన్ని ఆగస్టు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించాడు
By: Tupaki Desk | 24 July 2024 7:12 PM GMTఇటీవల కాలంలో టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా "లారి చాప్టర్-1". యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం ఈ చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఇందులో శ్రీకాంత్ నటించడమే కాదు డైరెక్టర్, స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్, ఎడిటింగ్, స్టంట్ మాస్టర్.. ఇలా అన్నీ తానై వ్యవహరించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
"లారీ చాప్టర్-1" చిత్రాన్ని ఆగస్టు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, లిరికల్ వీడియోలను రిలీజ్ చేశారు. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
'లారి చాప్టర్ -1' సినిమాలో శ్రీకాంత్ రెడ్డి సరసన చంద్రశిఖ శ్రీవాస్ హీరోయిన్ గా నటించింది. రాఖీ సింగ్ ప్రధాన పాత్ర పోషించగా.. గీతా బోస్లె, అశ్వినీ, రవి, గోల్డ్ రెడ్డి, సతీష్ వంటి పలువురు నూతన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ లో ఆసం వెంకట లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాడిపత్రి నాగార్జున సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆసం శ్రీకాంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. చెన్నై లయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసి దర్శకత్వ విభాగంలో మెలకువలు నేర్చుకున్నాడు. అనంతరం హైదరాబాద్ వచ్చి కొన్ని చిన్న చిన్న సినిమాలకు వివిధ విభాగాల్లో పని చేశాడు. అలానే యూట్యూబ్ ప్రాంక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'లారీ చాప్టర్ -1' సినిమాతో వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.
గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి, ఆర్పీ పట్నాయక్, ఆర్. నారాయణ మూర్తి, రాఘవ లారెన్స్ లాంటి కొందరు దర్శకులు.. ఒక సినిమాకి వివిధ విభాగాల్లో పని చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి డెబ్యూతోనే హీరోగా, డైరెక్టర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా, ఫైట్ మాస్టర్ గా, ఎడిటర్ గా పరిచయం కాబోతున్నాడు. 'లారి చాప్టర్-1' సినిమా దాదాపు 3 గంటల నిడివితో ఆగస్టు 2న రిలీజ్ అవుతోంది. అదే రోజున విడుదల కానున్న శివం భజే, బడ్డీ, సింబా, తిరగబడరసామీ, ఉషా పరిణయం, అలనాటి రామచంద్రులు లాంటి చిత్రాలను తట్టుకొని ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.