శ్రీలీల 'మంగళవారం' ఏం చేస్తుంది..?
'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 8 Feb 2025 6:30 AM GMT'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా భారీ పారితోషికం దక్కించుకుంటుంది. అంతే కాకుండా టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గానూ ఈ అమ్మడు నిలిచింది. గత ఏడాది చివర్లో ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప 2' సినిమాతో వచ్చింది. పుష్ప 2 లో శ్రీలీల చేసిన కిస్సిక్ ఐటెం సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. అల్లు అర్జున్‌తో శ్రీలీల చేసిన డాన్స్‌కి పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మడు దాదాపు ఆరు సినిమాలు చేస్తోంది. అవి మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ సినిమా 'పరాశక్తి'లోనూ ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక తెలుగు హీరోయిన్ ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా తాజాగా మంగళవారం సినిమా సీక్వెల్‌లోనూ శ్రీలీల నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. 2023లో వచ్చిన మంగళవారం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌గా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. అందుకే మంగళవారం సీక్వెల్ రూపొందబోతుంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో నటించిన 'మంగళవారం' సినిమాకు సీక్వెల్ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ మంగళవారం సీక్వెల్‌ను కన్ఫర్మ్ చేసింది. అయితే సీక్వెల్‌లో తాను నటించడం లేదని ఇండైరెక్ట్‌గా చెప్పింది. మంగళవారం 2 సినిమా పూర్తిగా కొత్త కథతో ఉంటుందని తెలుస్తోంది. అందుకే పాయల్ రాజ్‌పుత్ కాకుండా మరో హీరోయిన్‌తో సినిమాను రూపొందించేందుకు గాను దర్శకుడు అజయ్ భూపతి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వేళ అవసరం అయితే చిన్న గెస్ట్ రోల్‌లో పాయల్ రాజ్‌పుత్ నటించే అవకాశాలు ఉన్నాయి.
మంగళవారం సీక్వెల్‌లోనూ కథను విభిన్నంగా చూపించేందుకు అజయ్ భూపతి స్క్రిప్ట్ రెడీ చేశారట. పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత తన స్క్రిప్ట్‌కి శ్రీలీల అయితే బాగుంటుంది అనే నమ్మకంకు వచ్చాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అజయ్ భూపతి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అలాగే శ్రీలీల సైతం ఈ విషయం గురించి స్పందించలేదు. కానీ వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి అనేది మాత్రం నిజం అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మంగళవారం సినిమా సీక్వెల్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మంగళవారం 2 సినిమాలో నటిస్తే కచ్చితంగా పెద్ద ఛాలెంజింగ్ రోల్‌గా శ్రీలీల కెరీర్‌లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న మంగళవారం 2 సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.