Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ హీరోతో ఎన‌ర్జిటిక్ బ్యూటీ తెలివైన ఆట‌

ప్ర‌స్తుతం శ్రీ‌లీల దూకుడు చూస్తుంటే కొన్నేళ్ల పాటు బాలీవుడ్ లోను తీరిక లేనంత బిజీ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 3:54 AM GMT
యాక్ష‌న్ హీరోతో ఎన‌ర్జిటిక్ బ్యూటీ తెలివైన ఆట‌
X

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. త‌న‌దైన అందం.. ప్ర‌తిభ .. చురుకుద‌నంతో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించిన ఈ బ్యూటీ. నేటిత‌రంలో సాయి ప‌ల్ల‌వి త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి ఎన‌ర్జీ ఉన్న‌ డ్యాన్సింగ్ క్వీన్ అని నిరూపించింది. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ న‌ట‌వార‌సుడు రోష‌న్ స‌ర‌స‌న ఆరంగేట్రం చేసిన‌ ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్ర‌తిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. ఏడాదికి నాలుగైదు సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇటీవ‌ల కొన్ని ప‌రాజ‌యాలు త‌న‌పై విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి. శ్రీ‌లీల స్క్రిప్టు, పాత్ర‌ల ఎంపిక స‌రిగా లేదంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వాట‌న్నిటికీ చెక్ పెట్టేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నంలో ఉంది. త‌దుప‌రి మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించ‌నున్న ల్యాండ్ మార్క్ 75వ మూవీలో శ్రీ‌లీల క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

ఇంత‌లోనే బాలీవుడ్ లో స‌త్తా చాటేందుకు శ్రీ‌లీల గేమ్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇటీవ‌ల వ‌రుణ్ ధావన్ స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చింద‌ని, కానీ శ్రీ‌లీల ఆ ఆఫ‌ర్ ని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత మ‌రో ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌టిస్తున్న భారీ క్రేజీ చిత్రంలో శ్రీలీల‌ను ఆఫ‌ర్ వ‌రించింది. ఈ సినిమా టైటిల్ 'మిట్టి'. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిసిన ఈ చిత్రానికి బల్వీందర్ సింగ్ దర్శకుడు. అప‌రాధ భావ‌న‌తో జీవించే యువ‌కుడి మ‌నోభావాల‌కు అద్దం ప‌డుతూ ఎమోష‌న‌ల్ ట‌ర్న్ తీసుకునే అద్భుత‌మైన క‌థ‌ను బ‌ల్వీంద‌ర్ ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ఇందులో సిద్ధార్థ్ సీరియ‌స్ ఇంటెన్స్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. భారీ యాక్ష‌న్ కి స్కోప్ ఉంది. హిందీ మీడియా క‌థనం ప్రకారం.. స్క్రిప్ట్ ను, త‌న పాత్ర గురించి విన్న వెంటనే శ్రీలీల ఆమోదముద్ర వేసింది. కథానాయిక పాత్రను చక్కగా రాసుకున్నారని, దర్శకుడు తన కథనంతో ట్యాలెంటెడ్ శ్రీలీల‌ను మెప్పించాడని అంటున్నారు.

మిట్టి అక్టోబర్ 2024లో సెట్స్‌పైకి వెళ్లనుంది. మిట్టితో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ చిత్రం 'డైలర్‌'లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల దూకుడు చూస్తుంటే కొన్నేళ్ల పాటు బాలీవుడ్ లోను తీరిక లేనంత బిజీ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. శ్రీ‌లీల లైవ్ వైర్ లా అద్భుత నృత్యాల‌తో ఆక‌ట్టుకోగ‌ల‌దు. న‌ట‌న‌లో ఎన‌ర్జీ అంద‌రికీ న‌చ్చుతుంది. అందువ‌ల్ల శ్రీలీల‌కు ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా అవ‌కాశాల‌కు కొద‌వేమీ ఉండ‌దు. అయితే టాలీవుడ్ ని విడిచిపెట్ట‌కుండానే హిందీ, త‌మిళ చిత్ర‌సీమ‌ల్లో అవ‌కాశాల్ని ఈ భామ తెలివిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ నుంచి సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో శ్రీ‌లీల మిట్టీ సెట్స్‌లో జాయిన్ అవుతుందని తెలిసింది.