శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్: బాలకృష్ణ
మా ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయి. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారు.
By: Tupaki Desk | 16 Oct 2023 3:56 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రం `భగవంత్ కేసరి`. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిసున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. తాజాగా ప్రచార వేదికపై నటసింహా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ భగవంత్ కేసరిలో శ్రీలీల పాత్ర తీరు తెన్నులు అద్భుతంగా ఉంటాయని, తనతో కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని అన్నారు.
అంతేకాదు శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్ అంటూ తన సహజసిద్ధమైన నటనను పొగిడేసారు. బాలకృష్ణ మాట్లాడుతూ-``శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయి. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారు. అంత అద్భుతంగా వచ్చింది మా మధ్య కెమిస్ట్రీ. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలనే తనప శ్రీలీలలో వుంది. ఎంతో తపన ఉన్న నటి. హీరో హీరోయిన్ పాత్రలు అందరూ చేస్తారు. వైవిధ్యం ఉన్న ఇలాంటి పాత్రలో నటించినందుకు శ్రీలీలకు అభినందనలు`` అని అన్నారు. అనంతరం శ్రీలీల పాదనమస్కారాలు చేసుకోగా, తనకు బాలయ్య ఆశీర్వచనాలు అందించారు.
శ్రీలీలతో పాటు ఈ సినిమాలో విలన్ గా నటించిన అర్జున్ రామ్ పాల్ నటన అదరగొట్టారని బాలయ్య బాబు పొగిడేశారు. అతడు ఎంతో ఒదిగి ఉండే హీరో. రాత్రి 12 అయినా మాతో ఎంతో సహకరించారు. అంతేకాదు.. ఇంకా చెప్పాలంటే అతడు తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు. అర్జున్ రాంపాల్ గొప్ప నటుడు. యువతరం డ్రీమ్ బోయ్ అని కూడా బాలయ్య బాబు ప్రశంసించారు.
ఈ చిత్రంలో ప్రతి పాత్ర అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా వుంది. దాచిపెట్టాం. తెరమీద మీరే చూస్తారు. తర్వాత దబ్బిడి దిబ్బిడే. ప్రేక్షకులందరినీ సినిమాలో కి తీసుకెళ్ళిపోతాయి మా పాత్రలు... అని తెలిపారు. నిర్మాతలు హరీష్, సాహు చాలా అద్భుతంగా సినిమాని నిర్మించారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ... ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతచక్కగా ఈ ఇందులో పాత్రలని మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తనో మళ్ళీ కలసి పని చేయడానికి ఎదురుచూస్తుంటాను... అని కూడా తెలిపారు.