మురళిమోహన్ మనవరాలిని పెళ్లాడిన కీరవాణి కొడుకు
ఈ శనివారం శ్రీసింహా వివాహం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాలో శ్రీసింహా కోడూరి- రాగ మాగంటి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
By: Tupaki Desk | 15 Dec 2024 5:46 AM GMTనాటు నాటు.. తో దేశం గర్వించదగిన 'ఆస్కార్'ని అందించాడు మరకతమణి ఎం.ఎం.కీరవాణి. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా టాలీవుడ్ కథానాయకుడు అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వెటరన్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీ సింహ కోడూరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ చిరస్మరణీయ వేడుకకు రాజకీయ నాయకులతో పాటు సినీ తారలు కూడా హాజరయ్యారు.
ఈ శనివారం శ్రీసింహా వివాహం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాలో శ్రీసింహా కోడూరి- రాగ మాగంటి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి కొద్దిమంది బంధుమిత్రులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ నుంచి ఫోటోలు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
నటుడు శ్రీ సింహ కోడూరి రాజమౌళి తెరకెక్కించిన 2007 చిత్రం 'యమదొంగ'లో తొలిసారిగా నటించాడు. అతడి అన్నయ్య కాల భైరవ తెలుగు సినీరంగంలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. శ్రీసింహా 'మత్తు వదలరా' చిత్రంతో కథానాయకుడు అయ్యాడు. 2021లో 'తెల్లవారితే గురువారం చిత్రంలో కనిపించాడు.
శ్రీ సింహ నిజానికి రాజమౌళి ఆస్థానంలో కీలక టెక్నీషియన్. రాజమౌళి వద్ద మెజారిటీ సినిమాలకు పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించాడు. 2018లో 'రంగస్థలం' కోసం సుకుమార్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అతడిని హీరోగా గుర్తించింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల 'మత్తు వదలారా 2'తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.